తను జీవించడమే కాదు
ఇతరులనూ బతుకనివ్వడం కదా
బతుకు అర్థం
మెతుకై పండిన జీవతత్వం
చితికిన బతుకులకు
స్ఫూర్తినిచ్చే మనసున్న
ఆపన్నహస్తమే బతుకు పరమార్థం
నడిచే గడియారంలా మనిషి
కాలమనే లోలకంపై ఊగుతుండు అటూఇటూ
మనసు వేగాన్ని అందుకొనే యంత్రం ఏముంది
ఈ రంగుల జీవనయాత్రలో!
పాదాలు నడుస్తూ ఆడే ఆటలో
హృదయ చనలం రాస్తుంది కావ్యాలు
మది పులకించె అక్షర బంధాలై
కౌటుంబిక రుధిరం నడకలు
బతుకు దారుల సంబంధాలు
చెట్టు ఆకులు కొమ్మలు నిండిన
ఫల పుష్పాల పరిమళించే సన్నాయి
మట్టి మకుటంలో
మనిషి బతుకు ఓ ఆకాశం
పిడికెడు గుండెలో నివసించే
పాల కడలి కెరటాల సవ్వడి
గాలిలో గాలిలా కలిసి,
వానలో వానలా తడిసి,
ఎండలో ఎండగా వర్షించే దేహ శ్రమ దాహమే గదా
బతుకు అర్థంలోని పరమార్థం
బతుకుతూ,నిన్ను బతుకనివ్వడం
నిర్వచనీయ మహోజ్వల కూడలి
బతుకు ప్రవహించే నదీ నదాల గీతం
అదే మనిషిలో
ఓ అసాధారణ విలువల జీవధార
మట్టిలో నిటారుగా నిలిచే చెట్టు
లోలోని వేళ్ళు మనకు పరిచిన సహజ నీడనే
బతుకు మరో నిర్వచనం నేలపై

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి