సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 
సంస్థితి...సంస్తుతి
   *****
"జాతస్య మరణం ధృవం" అని సంస్కృతంలో అన్నా "పుట్టుట గిట్టుట కొరకే" అని  తెలుగులో అన్నా పుట్టిన ప్రతి జీవి సంస్థితి చెందక తప్పదు అని అర్థం.
ఆ జీవుల్లో అత్యంత ప్రత్యేకమైన జీవి మనిషి. జీవుల్లో చాలా వరకు పరుల ఉపకారం చేసేవే ఉన్నాయి.
మనుషులుగా అన్ని జీవుల ఉపకారాన్ని అందుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి.
ఈ జన్మ సంస్థితి చెందే లోగా  ఈ  సమాజానికి,ఈ లోకానికి ఏదో ఒక రూపంలో మేలు చేయాలి. అలా చేసినప్పుడే మన పుట్టుకకు సార్థకం చేకూరుతుంది.
మరి సంస్థితి అంటే ఏమిటో చూద్దాం... మరణము, కాలధర్మము,దేహ త్యాగము, నిర్యాణము, మహానిద్ర,శరీర పతనము, స్వర్గతి అనే ముఖ్యమైన పర్యాయ పదాలతో పాటు ప్రళయము,అంత్యకాలము,కల్పాంతము, కల్పము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
మనసున్న మనుషులుగా సమాజం కోసం ఉపయోగ కరమైన  పనులు ఎవరు చేసినా వారిని సంస్తుతి చేయాలి.అది మానవీయ ధర్మం. 
అలాంటి పొగడ్తలను అందుకున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా హృదయ సంస్తుతి జేసిన వారి ఔన్నత్యం కూడా అందరికీ తెలుస్తుంది.
మరి సంస్తుతి అంటే ఏమిటో చూద్దాం... స్తుతి, పొగడ్త,అభిమతి,అభినందనము,ప్రస్తుతి,సన్నుతి,శస్తి,శ్లాఘము, శ్లాఘనము అనే అర్థాలు ఉన్నాయి.
సంస్తుతి పొందగల పనులను చేద్దాం.సంస్థితి చెందినా  సాటి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు