చెట్టు - మనిషి;-- యామిజాల జగదీశ్
 ఓ ఊళ్ళో ఓ పెద్ద మామిడి చెట్టు. చాలా గంభీరంగా కనిపించేదా చెట్టు. అందులో బోలెడు పువ్వులు....కాయలు....పళ్ళు....
ఓ కుర్రాడికి ఆ చెట్టు కింద ఆడుకోవడం అలవాటు. ఆ చెట్టుకి ఆ చిన్నోడంటే ఇష్టం.
వాడికి ఆ చెట్టునున్న పువ్వులూ పళ్ళూ కోయాలని ఆశ. అది తెలిసీ చెట్టు తన కొమ్మలను అతనికి అందేలా వంచింది.
 
కుర్రాడు పువ్వులను కోస్తూ ఆనందించాడు. చెట్టేమో ప్రేమకు సంకేతం. కనుక అది ఇవ్వడంలో ఆనందించింది. మనిషేమో అహానికి సంకేతం. కనుక తీసుకోవడానికి ఆరాటపడుతుండేవాడు.
కుర్రాడు పెరిగి యువకుడయ్యాడు.
 
ఓరోజు ఆ చెట్టునున్న
పువ్వులను కోసి వాటితో ఓ కిరీటం చేసుకుని తలకు పెట్టుకున్నాడు.
పండ్లను కోసి తిన్నాడు. అతనిని చూసి చెట్టు ఆనందించింది.
కొంత కాలం గడిచింది. 
వాడు మరింత పెద్దవాడయ్యాడు. అతను చెట్టెక్కి కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలలా ఊగాడు. అతననుకున్నట్లల్లా తనను మలచుకోవడం ఆ చెట్టుకెంతో ఇష్టం. ఆనందం. కానీ అతను అది అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చినట్లల్లా ఆ చెట్టుమీద ఊగుతుండేవాడు. అదే ప్రేమకూ ఆహంకారానికి మధ్య ఉన్న తేడా.
వాడు మరింత పెద్దవాడయ్యాడు. అతనికి బాధ్యతలు లక్ష్యాలు వంటివి మొదలయ్యాయి. దాంతో అతను చెట్టు వద్దకు రావడం లేదు. కానీ చెట్టు అతనికోసం ఎదురు చూస్తూనే ఉంది. అతను తన లక్ష్యసాధనలో మునిగిపోయాడు.
అనుకోకుండా ఓ రోజు అతను ఆ చెట్టు పక్కగా వెళ్ళాడు. చెట్టు అతనిని చూసి మరచిపోయేవా ? నిన్ను చూసి చాలా కాలమైంది కదూ...ఎలా ఉన్నావూ అంది.
అతను "నీ దగ్గరేముంది? నేనెందుకు నీ దగ్గరకు రావాలి? నేనిప్పుడు డబ్బు కోసం పరుగులు తీస్తున్నాను" అన్నాడు.
"నీకు డబ్బేగా కావాలి....నా నుంచి పళ్ళు కోసి అమ్ముకో. నీకు నాలుగు డబ్బులొస్తాయి" అంది చెట్టు.  
వెంటనే అతను చెట్టెక్కాడు. పండ్లను కోసాడు.  అలాగే కాయలూ కోసాడు. ఈ క్రమంలో తన కొమ్మలను విరిచినందుకు చెట్టేమీ బాధపడలేదు. పైగా ఆనందించింది.
కానీ అతను కావలసినంత కోసుకున్నాడే కానీ చెట్టుకి కనీసం కృతజ్ఞతలుకూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలటు రావడమే మానేశాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతుకు తున్నాడు.
మరోవైపు అతను రావడం లేదేనని చెట్టు బాధపడుతుండేది. ఎదురుచూస్తుండేది.
కొన్ని సంవత్సరాలు గడిచాక ఓ రోజు అతను ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. అతనిని చూడటంతోనే చెట్టు మహా అనందంతో రారా అని ఆహ్వానించింది. నన్ను కౌగిలించుకో అంది. 
అప్పుడతను "నేనేమన్నా చిన్న పిల్లాడినా? నిన్ను కౌగిలించుకోవడానికి...నేనిప్పుడు ఓ ఇల్లు కట్టుకోవాలి. నాకు సాయం చేస్తావా" అని అడిగాడు
 "తప్పకుండా చేస్తాను. నా కొమ్మలను నరికి తీసుకెళ్ళు" అని చెప్పడంతోనే అతను కొమ్మలన్నీ కొట్టేశాడు. 
కొంత కాలం జరిగింది. అతను మరింత పెద్దవాడై ఆ చెట్టు వద్దకు వచ్చాడు. 
"నేను దూరదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలని ఆశ.  నేను ప్రయాణం చేయడానికి ఓ పడవ కావాలి. అందుకు నువ్వు సాయం చేయగలవా"అని అడిగాడు. 
"అదేమీ పెద్ద సమస్య కాదు. నా కాండాన్ని నరికి తీసుకో. దానితో ఓ పడవ చేసుకో" అంది చెట్టు. 
వెంటనే అతను అలాగే ఓ పడవ తయారు చేసుకుని వెళ్ళిపోయాడు.
ఇకమీదట అతను తిరిగొస్తాడా? రాడా? తెలీదు. కానీ ఆ చెట్టు అడుగు భాగం అతని కోసం నిరీక్షించింది.
ఎందుకంటే చెట్టు ప్రేమకు చిహ్నం.
అతను అహంకారానికి చిహ్నం.
ఇలా ఓ కథ చెప్పాడు ఓ పెద్దాయన.
ప్రేమ ఇవ్వడానికే ఆశ పడుతుంది. 
అహంకారం ఎప్పుడూ పొందడానికే ఆశ పడుతుంది. కనుక మనకు చేతనైనమేరకు నలుగురితో ప్రేమగా ఉందాం.

కామెంట్‌లు