భరణి భరణియే;-- యామిజాల జగదీశ్
 తనికెళ్ళ భరణి గారి గురించి ఏదో ఒకటి రాయాలని ఆశ. కానీ నాకా శక్తి లేదు. అంటే నా హృదయంలో ఆయన మీదున్న భావాలు కాగితం మీద పెట్టడానికి మాటలు సరిపడా లేవు. ఆ ఈశ్వరుడి భక్తుడికి నేను భక్తుడ్ని అన్న రచయిత జనార్దన మహర్షి మాటనే నేనూ చెప్దామనుకుంటే మహర్షిగారు ఆ మాటను తన సొంతం చేసేసుకున్నారు. మరి నేనేం చేయాలి...ఆ మాటనే నేను మనసులో జపం చేసుకోవాలి. నేను 1982లో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు రాంనగర్లో ఓ గదిలో తల్లావఝ్జుల శివాజీ, లలితాప్రసాద్, మా అన్నయ్య ఆనందుతో కలిసి ఉండేవాడిని. శివాజీ సోదరులకు భరణి సన్నిహితులు. ఓమారు శివాజీని కలవడం కోసం మేమున్న గదికి వచ్చారు భరణిగారు. తేదీ గుర్తు లేదు గానీ అప్పుడే నేను మొదటిసారి చూడటం. ఆ తర్వాత బ్నింగారిని కలిసినప్పుడల్లా మాటల మధ్యలో భరణిగారి ప్రస్తావన వచ్చితీరుతుంది. అలా ఈ నెల ఒకటో తేదీన బ్నింగారింటికి వెళ్ళినప్పుడు భరణిగారి గురించి ఎప్పట్లాగే అనుకున్నాం. అంతకుమందు రోజు తెనాలిలో భరణిగారికి ఘనసన్మానం జరిగింది. ఆ సన్మానం గురించి చెప్తూ భరణిగారిపై ఆవిష్కరించిన ఓ ప్రత్యేక సంచికను చూశాను. 
భరణిగారి గురించి బ్నింగారు వినిపించిన మాటలివి........   
.......
“1980 - ఆత్రేయపురంలో నేనుండగా భరణి పెన్‌ ఫ్రెండ్‌షిప్‌ మొదలు ` యజ్ఞయ్య గారి పెట్రోల్‌ బంక్‌లో ఏ.వి. క్రిష్ణమూర్తితో ఉద్యోగం చేస్తున్న భరణి ‘ఎవడ్రా వీడు. రాత బాపూదీ, భాష రమణది’ అని పెన్‌ఫ్రెండ్‌షిప్‌కి శ్రీకారం చుట్టాడు -
.....
1981 - సీతాఫల్మండిలో స్నేహం బలపడడం, ‘కళాకౌముది’ అనే సంస్థ స్థాపించడం. సి. మంగపతి రావ్‌, సి.వి.ఎల్‌ నర్సింహారావ్‌ ఆధ్వర్యంలో - ఒక లిఖిత మాసపత్రిక ప్రారంభించడం (ఇక్కడ కొంచం సోత్కర్ష. ఆ సందర్భంగా దివాకర్ల వెంకటావధాని గారికి నేను రాసిన సన్మాన పత్రం అత్యద్భుతంగా నచ్చటం -)
.....
1982-83 ఆంధ్రభూమిలో నా ఉద్యోగం. ‘ సామాన్య శాస్త్రం ఫీచర్‌తో ఆఫీసుకి భరణి రావడం -
అదే సమయంలో నడక మర్చిపోయిన నన్ను భారత్‌ కేఫ్‌కి  చేయి పట్టి నడిపించుకుంటూ (ఈడ్పించుకుంటూ) తీసుకెళ్ళి టీ తాగించడం -
.....
తర్వాత భరణి మద్రాసు వెళ్ళిపోయాడు. సినిమా వాడై పోయాడు - నాకన్నా మరింత పొడుగైపోయాడు. మీరనాలా, నువ్వనాలా.. అనే డౌటు తన ముందే పడ్డాను. గట్టిగా నెత్తిమీద మొట్టి బంతిలా తనంత ఎత్తుకి పెంచాడు.
......
కొన్నేళ్లకి బ్యాచిలర్‌ లైఫ్‌ విడిచిపెట్టి తాను ‘ఓ ‘ ఇంటివాడు ‘ అవుతున్నప్పుడు నా చేత పెళ్ళికార్డు రాయించుకున్నాడు. (ఇక్కడో జోకు భరణీ అమ్మగారు... బ్నింతో రాయించావా ... వాడు - ‘‘నేనూ- అదీ పెళ్ళాడుతున్నాం. మీరొస్తే రావచ్చు రాస్తాడ’’న్నారట... ఇప్పటికీ అది నాకో సర్టిఫికెట్టే...) ఆతర్వాత హైదరాబాద్‌ వొచ్చేశాక... ఒకటో, రెండో ఇల్లు కట్టుకున్నాడు.
గృహప్రవేశం కార్డులు నాతోనే రాయించుకున్నాడు. లేకపోతే నేను ఒప్పుకుంటానా...? సౌందర్యలహరి అని ప్రగతినగర్‌ ప్రస్తుత నివాసానికి నా రైటింగే నేమ్‌ ప్లేట్‌!
......................
తల్లావజ్జుల సుందరంగారికి, భరణీకి మధ్యన నేను (జిగురు) జిగిరీ దోస్తునయ్యాను. సుందరంగారు వర్చస్వీ టి.వి. సీరియల్‌, అభిషేకన్‌ టివి సీరియల్‌ తీస్తున్నప్పుడు భరణీని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేసాను.
.....
ఆ తర్వాత్తర్వాత ఎప్పుడో అంతకుముందో “పరికిణి” పుస్తకం వేస్తున్నప్పుడు లే అవుట్‌  డిజైనర్‌గా ఒక అద్భుతం చేయనిచ్చాడు భరణి. అది ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది.
.....
తర్వాత ‘నక్షత్ర దర్శనం’- దానికి ముందు మాటతో పాటు బొమ్మలేశాను. ఎంత అదృష్టం నాది !
.................
ఆట కదరా శివా.. అన్నాడొక శుభ సాయంత్రం.  అద్భుతం. మా అమ్మకీ నాకూ బాగా నచ్చేసింది. మా అమ్మ చివరి రోజుల్లో ఆమెకి ఆ పాట పాడి వినిపించాడు - అమ్మ ఎంతో సంతోషించింది.
దానికి బాపు గారితో  రెండు ముఖ చిత్రాలు వేయించాను. ఆ క్రెడిట్‌ నేనే కొట్టేశాను .....
.......
భరణి వెండి పండగ ముఖ చిత్రం వేయడానికి బాపుగారు నాతో పంచుకున్న జోకు ...‘ఏవండీ ఈయనకి’ గెడ్డం గీయమంటారా అని... అంటే.... భరణీ ఫోటో చిరుగెడ్డంతో ఉంది. అది అద్భుతంగా వేశారు బాపుగారు -
.....
పెళ్ళిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, సినిమాల్తో బాటు  శ్రీభాగవతం సీరియల్లో కలిపురుషుడు వేషం వేసినపుడు `  నా  అనుభూతులు స్వానుభావాలు - మా ఇద్దరికీ విచిత్రానుభవాలు - బాపు గారిని ప్రేమించే - ఆరాధించే భరణి ఆయన ఆగ్రహానుగ్రహాలు మేమిద్దరం ప్రత్యక్షంగా ఆస్వాదించాం.
.....
‘అక్షజ్ఞ పబ్లికేషన్స్‌ అని ఒక  ఎన్ఆర్ఐ ఫ్రెండ్‌ ముదునూరి వెంకట్‌ ప్రారంబించిన సంస్థకి ‘చేత వెన్న ముద్ద’ అనే పుస్తకంతో శ్రీకారం చుట్టాము. ‘శ్రీరాముని దయచేతను’ అనే పుస్తకం - ఆ తర్వాత శ్రీశ్రీ గారి ‘కవితా – ఓ కవితా’ అనే బుజ్జి పుస్తకం - నా ద్వారా అక్షజ్ఞ వారి ప్రచురణగా వెలువడ్డాయి...
......................
 
భరణి నేను - హాస్యానందాల్తో.. నా ప్రతీ కార్యక్రమానికి దక్షత కలిగిన వ్యక్తిగా వెలుగొందుతూ ఉంటాం-
ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇంకా మేమిద్దరం ఇలాగే కలిసి మెలేసుకుని పెరగాలని ఉంది - నా ప్రతీ పుట్టిన్రోజు పండగకి ఆయనే చీఫ్‌ గెస్ట్‌!” అని బ్నింగారు చెప్పుకొచ్చారు.
................
ఇదిలా ఉంటే జర్నలిస్ట్ మిత్రుడు ఖదీర్ బాబు ఓ చోట రాసిన వ్యాసంలోంచి ఒక్క మాటతో ఈ నాలుగు ముక్కలూ ముగిస్తాను...
ఓసారి ఖదీర్ బాబుగారు ఆటోగ్రాఫ్ ఇమ్మంటే భరణిగారు ఖదీర్ బాబు పేరు రాసి తన పేరు కూడా రాసి భరణిలో ‘ణ’ మీద గుడి పెట్టకుండా నక్షత్రం (భరణి అనేది 27 నక్షత్రాలలో రెండవదిగా) వేశారట. బలే ఉంది కదండీ.





కామెంట్‌లు