ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;




 లక్షల  హృదయాల స్పందనే ఆ ఉదయం...ఆ ఉదయం కోసం ఎదురు చూసిన ఉద్విగ్న క్షణాలే ఆ కలయిక... ముప్పై సంవత్సరాల తరువాత తమ తమ గురుతుల్యులను, స్నేహితులను,ఒక్కచోట చూసినప్పుడు...లంచ్ టైంలో,తన కొలీగ్ తో అన్నం,కూర,చపాతి పంచుకున్న జ్ఞాపకం....జీతం సరిపోక తన బాధలను చెప్పుకునేందుకు, వాటిని తీర్చ లేకపోయినా, ధైర్యం చెప్పే ఒక బాస్... ఎందుకంటే ఆయన కూడా తన బాధలను ఎవరికి చేప్పుకోవాలో తెలియక, నిన్ను మాత్రం వెన్ను తట్టి ధైర్యంగా ఉండాలని చెప్పిన జ్ఞాపకం...చేసే వృత్తిలో జరిగే పొరపాటులు,తన నుంచి చిన్న ఆలస్యమైనా,పేపర్ ప్రింటింగ్ కి జరిగే జాప్యం, దానిని కవర్ చేసే తోటి ఉద్యోగ స్నేహితులు...ఆధిపత్య ధోరణితో,తోటి ఉద్యోగులను, ఇరకాటంలో పెట్టిన కొందరు మహానుభావులు..తనని దిక్కరించారనీ, నిర్ధాక్షిణ్యంగా
కింది స్థాయి ఉద్యోగులను,తొలగించిన పరిస్థితులు..
ఇలా ఎన్నో జ్ఞాపకాలు మస్తిష్కంలో సుడులు తిరుగుతున్న క్షణాన,కొన్ని ఆప్యాయతల ఆనంద భాష్పాలు, కళ్ళు చమర్చిన సందర్భాల,ఉదయం....ఆ ఉదయం... ఉదయం మా హృదయం... నిన్న ఆదివారం ఉదయం సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉదయం కుటుంబం ఆత్మీయ సమ్మేళనంలో ముప్పై సంవత్సరాల తరువాత కలుసుకున్నప్పటి దృశ్యం.
                 డిసెంబర్ నెల, బుక్ ఫెయిర్ చివరి రోజు.నేను మిర్యాలగూడలో ఉన్న కారణంగా,వీలుకాక
చివరి రోజు వెళ్ళాను.అక్కడ కాసుల ప్రతాపరెడ్డి గారు కలిసి, విఎస్ఆర్ ప్రభాకర్ గారి గురించి అంతకు ముందు జరిగిన ఒక సంఘటన చర్చించుకుంటూ, నన్న,రాధామనోహర్ గారిని, ఉదయం వాట్సాప్ గ్రూపులో చేర్చారు.ఇక అప్పటి నుంచి మన ఆత్మీయ సమ్మేళనం గురించి అప్ డేట్స్ చూస్తున్నాను.నిజంగా ఈ విషయంలో,సైదారెడ్డి గారు, కాసుల ప్రతాపరెడ్డి గారు,హేమ సుందర్ గారు,గురువారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు,రవికాంత్ గారు...వీళ్ళంతా చాలా కష్టపడ్డారు, వాట్సాప్ గ్రూపు ద్వారా అందరినీ మోటివేట్ చేయడానికి.చివరికి ఆ రోజు రానే వచ్చింది.ఇరవై తొమ్మిది జనవరి, ఆదివారం
ప్రెస్ క్లబ్ వేదికగా.
                     అందమైన వేదిక ఆ వేదికపై పెద్దలు ఏబికే ప్రసాద్ గారు, రామచంద్రమూర్తి గారు.వెనక నీలి రంగులో ఆత్మీయ సమ్మేళనం ఫ్లెక్సీ,ఆ పక్కనే దాసరి గారి ఫోటోతో ఉన్న ఆయన మాటలు.వేదిక ముందు ఉదయం కుటుంబ సభ్యులు.ఒక పత్రిక నడవాలంటే మెనీ హాండ్స్ విత్ వన్ మైండ్... రకరకాల డిపార్ట్మెంట్స్ తమ పని సమర్థవంతంగా నిర్వహిస్తేనే తెల్లవారితే మనం పేపర్ చదివే అవకాశం ఉంటుంది.ఏ డిపార్ట్మెంట్ తక్కువ కాదు,ఏ వ్యక్తి తక్కువ కాదు.అందరూ కలిసి కట్టుగా,అంటే ఒక టీమ్ గా పనిచేస్తేనే ఒక న్యూస్ పేపర్ బయటకు వస్తుంది.ఉదయం ఆ విధంగా మనల్ని ఒక దగ్గరకు కలిపింది.యాజమాన్యం మనకు కావల్సినంత స్వేచ్ఛనిచ్చింది, జర్నలిస్టుకి అంతకన్నా ఏం కావాలి.అద్బుతాలు సృష్టించడూ.. మృణాళిని గారు తన అనుభవాన్ని చెపుతూ,ఒక డివోషనల్ వార్తను,ఫ్రంట్ పేజీ వార్తగా వేయాలి,ఇది ఎడిటర్ గారి ఆర్డర్..అని చెపితే ఆమె నిర్మొహమాటంగా నిరాకరించారు.ఆ తరువాత దాసరి గారు పిలిచి ఎందుకు వేయలేదు,అంటే నేను వేయలేనండీ..అని చెప్పేసింది.అప్పుడు దాసరి గారు, నీలాంటి వాళ్ళే అవసరమమ్మా నా పత్రికకు,అని అనడం కొస మెరుపు.
ఇలాంటి సంఘటనలు సెంట్రల్ డెస్క్ లో కోకొల్లలు.
                 ఒక పత్రిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో,మొదలైయ్యేందుకు ముందే, రెండు లక్షల సర్కులేషన్ అడ్వాన్స్ ఆర్డర్లతో,మార్కెట్ షేర్ ను కైవసం చేసుకొని ప్రారంభం కావడం అనేది నాకు తెలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి పత్రిక ఉదయం దిన పత్రికే
అనుకుంటాను.పందోమ్మిది వందల ఎనభై నాలుగులో
ప్రారంభమైన ఉదయం పత్రిక,దాసరి నారాయణరావు గారి, సారధ్యంలో అత్యద్భుత విజయాలను సాధించింది. అనుభవజ్ఞులైన ఎడిటర్లు ఏబికే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వరరావు,గజ్జెల మల్లారెడ్డి, పతంజలి శాస్త్రి, శ్రీరామచంద్ర మూర్తి గార్లు తమదైన శైలిలో పత్రికను నడిపించిన విధానం, అనిర్వచనీయం. బ్యూరో చీఫ్ లు గా పనిచేసిన దేవులపల్లి అమర్,రామ కృష్ణా రెడ్డి,పాశం యాదగిరి,ముకుంద్ సి మీనన్, బ్రహ్మానందరెడ్డి గార్లు, సెంట్రల్ డెస్క్ లో మృణాళిని గారు,సండే స్పెషల్ లో నెల్లుట్ల వేణు గోపాల్, చైతన్య ప్రసాద్, నాగేందర్ గార్లు, సబ్ ఎడిటర్లు సురేష్, రమణ మూర్తి,సైదారెడ్డి,విఎస్ఆర్ ప్రభాకర్,వేదాంత సూరి, శ్రీనివాస్ రెడ్డి, సాదిక్,గోపాల కృష్ణ, లలితా కృష్ణ గార్లు,సిటీ బ్యూరో లో, మాడభూషి శ్రీధర్ కాసుల ప్రతాపరెడ్డి, ఆర్టిస్ట్ అక్కినేని శ్రీధర్ గారు, ప్రొడక్షన్ అసిస్టెంట్ మహేందర్ లు సిటీ బ్యూరోలో,నా తోటి మిత్రులు రాధామనోహర్,పీవి చారి, పండరినాధ్,జగన్,హరి ప్రసాద్,మాధవ్, మధు,శంకర్, శ్రీనివాస్,మురళి, మౌలాలి లు నాకు తెలిసిన వ్యక్తులు...కట్ చేస్తే.....
                ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ స్టేజీ మీదకు వచ్చి,ఉదయంతో తమ ప్రయాణాన్ని,అందులో
 తమ అనుభవాలను,పంచుకున్నారు.సిటీ బ్యూరో తరుఫున నేను,మధు,హరి, సతీష్ మా అనుభవాలను
 సభకు తెలియజేశాం.కొందరు పాటలు, పద్యాలు పాడి
 సభను ఉత్సాహ పరిచారు.నిర్వాకులు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనం రుచికరంగా ఉంది.కాకినాడ కాజాలు, జున్ను, సాయంత్రం ఇచ్చిన పూతరేకులు కొందరికి అందకపోయినా, తిన్న వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పుకోవడం వినిపించింది.ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులను 
అక్కినేని శ్రీధర్ గారు, శాలువా కప్పి సన్మానించారు.
ఆ తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళను విడిగా ఫోటోలు తీసారు.అప్పుడు చూసాను ఎన్ ఎస్ ఎస్ సత్యవతి గారిని,ఆమె కూడా ఉదయం సెంట్రల్ డెస్క్ లో పనిచేసిందట.ఆమె ఉదయానికి ముందో ఈ తరువాతో లక్ష్మారెడ్డి గారి ఎన్ఎస్ఎస్ న్యూస్ లో రిపోర్టర్ గా పనిచేసారు.ఆమె ఎప్పుడు నాకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కలిసేవారు.సిటీ బ్యూరోలో పని చేసిన
రసూల్ గురించి తర్వాత రాస్తాను.ఆయన వైఫ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
                   చివరిగా చైతన్య ప్రసాద్ గారి స్ఫూర్తిదాయక ప్రసంగం నుంచి కొన్ని మాటలు.... ఉదయం మూసేసాకా నేను సినిమా రంగంలో దాదాపుగా ఇరవై సంవత్సరాలు పోరాటం చేస్తే, నాకు ఇప్పుడు ఈ సక్సెస్ లభించింది.అలా పోరాడాలని నేర్పించింది ఉదయమే.ఉదయం నాకెప్పుడూ ప్రత్యేకమే...
 ఉదయం మా హృదయం.....
                                  
కామెంట్‌లు