హిజ్రాల నిర్వహణలో "హోటళ్ళు!";- - యామిజాల జగదీశ్
 తమిళనాడులో హిజ్రాల సారథ్యంలో ఫలహారశాలలు నడుస్తున్నాయి.
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో హిజ్రాలు కలిసి నిర్వహిస్తున్న హోటల్ గత ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభమై విజయవం తంగా నడుస్తున్నాది.
ఈ సమాజంలో హిజ్రాలు కూడా ఒక భాగమే అని చాటి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన హోటల్ ఇది అని కోవై జిల్లా హిజ్రాల సంక్షేమ సంఘ కార్యదర్శి తెలిపారు.
పొల్లాచ్చిలో న్యూ బస్టాండ్ వెనకే సల్టానా వీధిలో కోవై హిజ్రాల హోటలు కోవై జిల్లా సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వాధికారి శ్యామల అధ్యక్షత వహించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మురుగేశన్, అరుళ్మణి, పొల్లాచ్చి లయన్స్ క్లబ్ ప్రతినిధి రాజశేఖర్ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోవై జిల్లా హిజ్రాల సంక్షేమ సంఘం కార్యదర్శి వీణాయాయిని మాట్లాడుతూ కోవై జిల్లా హిజ్రాల సంక్షేమ సంఘం 2012లో నుంచీ హిజ్రాల సంక్షేమం కోసం ఆర్థిక స్థితిగతుల మెరుగుకోసం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సాధించిపెట్టడం, సాంత కాళ్ళపై నిలవడానికి తోడ్పడటం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు మొదటిసారిగా పొల్లాచ్చిలో హిజ్రాల జీవనాధారం కోసం స్వయం ఉపాధిలో భాగంగా ఈ హోటలుని ప్రారంభించా మన్నారు. సమాజంలో తామూ ఒక భాగమే అని చాటి చెప్పడానికే ఈ హోటలు మొదలుపెట్టామన్నారు.
వంట కళతోపాటు ఇతర శక్తిసామర్థ్యాలు కలిగిన హిజ్రాలనేకులు కోవై జిల్లాలో ఉన్నారు. వారి ప్రతిభను గుర్తించి వారి జీవనాధారం కోసం ప్రభుత్వం ముందుకురావలసిన అవసరముంది.
హోటలు ప్రారంభించిన తొలిరోజునే స్థానిక కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఫలహారాలు చేసి వెళ్ళారు. హిజ్రాల కృషిని పలువురు ప్రశంసించారు.
 
ఇలా ఉండగా మదురైలోనూ హిజ్రాలు కొందరు కలిసి రెండేళ్ళుగా ఓ హోటల్ నడుపుతున్నారు. హిజ్రా జయచిత్ర ఆధ్వర్యంలో ఇది ప్రారంభమైంది. దీని పేరు ట్రాన్స్ కిచన్! ఇక్కడ పన్నెండుమంది హిజ్రాలు పని చేస్తున్నారు. వండటం, వడ్డించడం అంతా వీరి పనే. ప్రియా బాబు ఆలోచన మేరకు జయచిత్ర దీనికి శ్రీకారం చుట్టారు. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఉన్న ఈ హోటల్లో ధరలు తక్కువే. ఉదయం, రాత్రి ఫలహారాలు, మధ్యాహ్నం పూట లంచ్ ఉంటాయి. హిజ్రాల జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే ఇది ప్రారంభించామని జయచిత్ర తెలిపారు.
అదేవిధంగా మరి కొందరు హిజ్రాలు ఓ సంచార వాహన ఫలహార కేంద్రాన్ని నడపటం గమనార్హం.
 





కామెంట్‌లు