మూడు బొమ్మల రహస్యం (జానపద చిన్నకథ)

 ఒక రాజు ఆస్థానానికి ఒక శిల్పి వచ్చాడు.
తన చేతిలోని మూడు బొమ్మలు రాజు ముండు వుంచాడు. రాజా... ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలా వున్నా ఇందులో చాలా తేడా వుంది. ఈ సభలో ఎవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని సవాలు విసిరాడు.
అందరూ వాటిని పరిశీలించారు. ఎక్కడా కొంచంగూడా తేడా లేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు.
ఆ రాజ్యపు మంత్రి మహా మేధావి. ఎటువంటి చిక్కుముడి అయినా విప్పగల శక్తి గలవాడు. అతడు అచ్చు గుద్దినట్లు ఒకేలా వున్న ఆ మూడు బొమ్మలను బాగా పరిశీలించాడు. ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. సన్నని గడ్డి పోచలు మూడు తెప్పించాడు. ఒకదానిని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు. అది అవతలి చెవినుండి బైటికి వచ్చింది. ఇంకొకదానిని రెండవ బొమ్మ చెవిలో దూర్చాడు. అది నోటిలోంచి బైటికి వచ్చింది. మరొకదానిని మూడవదాని చెవిలో దూర్చాడు. అది లోపలికి పోయింది కానీ బైటకు రాలేదు.
మంత్రి చిరునవ్వు నవ్వుతా రాజా... ఈ మూడు బొమ్మలు మనుషుల యొక్క మూడు స్వభావాల గురించి వివరిస్తున్నాయి.
మొదటి బొమ్మ చూశారా... గడ్డిపోచ ఈ చెవిలొంచి ఆ చెవిలోకి వచ్చింది. అంటే వీళ్ళు ఏదీ మనసు పెట్టి వినరు. పట్టించుకోరు. ఇటువంటి వాళ్ళకు ఏం చెప్పినా వ్యర్థమే.
రెండవ బొమ్మ చూడండి. చెవిలోంచి దూర్చితే నోటిలోంచి బైటికి వచ్చింది. అంటే వీళ్ళు మనసులో ఏదీ దాచుకోరు. ఇటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం. వీళ్ళకి పొరపాటున గూడా మన రహస్యాలు చెప్ప కూడదు.
ఇక ఈ మూడవ బొమ్మ చూడండి. దీని చెవిలో దూర్చిన గడ్డిపోచ ఎక్కడనుండీ బైటికి రాలేదు. అంటే వీళ్ళు ఏది చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు. పొరపాటున కూడా నోరు విప్పరు. లోకంలో ఇటువంటి నమ్మకస్తులు చాలా తక్కువ. ఇదే ఈ మూడు బొమ్మల రహస్యం అన్నాడు.
ఆ సమాధానం విని శిల్పితో బాటు సభలోని వారందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు.
*********
కామెంట్‌లు