సూరీడు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అతడు ప్రతిరోజూ ప్రొద్దునవచ్చే ప్రభాకరుడు
అతడు తూర్పున తప్పకనిత్యముదయించే తపసుడు

అతడు అరుణకిరణాలతో అడరే అర్కుడు
అతడు జనులను జాగృతంచేసే జగత్సాక్షుడు

అతడు ప్రపంచానికే ప్రత్యక్షదేవుడు పూషుడు
అతడు లోకానికే లాతనిచ్చే లోకబాంధవుడు

అతడు నీటి నావిరిచేసే  నమతుడు
అతడు మేఘాలకు మూలమైన మార్తాండుడు

అతడు ఆరుఋతువులను అందగించే అంబరీషుడు
అతడు పన్నెండురాశులలో పయనించే పాంథుడు

అతడు సప్తాశ్వరరధమునెక్కి సంచరించే సవితృడు
అతడు ఉత్తరదిశకురథసప్తమినాడు ఉపక్రమించే ఉద్భటుడు

+++++++++++++++++++++++++++++++++++++++++

ప్రభాకరుడు= వెలుగును తయారుచేసేవాడు
తపసుడు= ఎండ లేక ఉష్ణమునకు కారకుడు
అర్కుడు= అర్చింపబడేవాడు, పూజింపబడేవాడు
జగత్సాక్షి: ప్రపంచంలో జరిగేవాటన్నిటిని చూచేవాడు/తెలిసినవాడు
పూషుడు= ద్వాదశాదిత్యులలో ఒకడు, ఆదిత్యుడు
లాత= వికాసం/వెలుగు
నమతుడు= నమస్కరింపబడువాడు
మార్తాండుడు= అంధకారమువలన నిద్రబోయిన బ్రహ్మాండాన్ని చైతైన్యవంతము చేయువాడు
అంబరీషుడు= పగటిపూట వెలుగునిచ్చేవాడు
పాంధుడు= పథకుదు, తెరువరి, బాటసారి
సవితృడు= లోకాదులను పుట్టించేవాడు, పరమాత్మ, సూర్యుడు
ఉద్భటుడు= అధికుడు, సూర్యుడు
లోకబాంధవుడు= లోకానికి బంధువు/చుట్టము
అందగించు= ఏర్పరుచు, శోభిల్లచేయు


కామెంట్‌లు