ఆది దంపతులు";- నలిగల రాధికా రత్న
వణుకుతున్న దేహంతో 
పడమటి పొద్దుకు చేరినా...
వారి అణువణువూ 
నిండివుంది సమైక్యతా భావం...!!

నడుములు కృంగి 
కాయం నేలకు వంగిపోతున్నా...
వారి అణువణువూ
సలాం అంటుంది  త్రివర్ణ పతాకానికి..!!

దేహం 
ముడతలు పడి 
పండుటాకులుగా మారినా....
వారి అణువణువూ
పాడుతుంది వందేమాతర గీతాన్ని...!!

ఉడికిన నరాలలో 
చెమటోడ్చిన దేహం సత్తువ తగ్గినా..
వారి అణువణువూ 
జైహింద్ అంటుంది అమరవీరులకు..!!

చూపు మందగించి 
దారి మసకబారినా...
జెండా కర్రను ఊతంగా చేసుకొని
వారి అణువణువూ
అంకితం అంటుంది భరతమాతకి...!!

నేను సైతం అంటూ ‌...
కన్న కొడుకు 
కదనరంగంలో వీరమరణం పొంది...
భరతమాత నుదుట సింధూరమై....
అస్తమించే వేళ అండ లేకపోయినా...

గతం తాలూకు 
అనుభవాలకు ప్రతిబింబాలై...
నేటి యువతరానికి 
సిసలైన మార్గదర్శకులై...
సంకల్ప బలంతో 
ఒకరికి ఒకరు ఆధారమై...
ఆత్మవిశ్వాసంతో 
బ్రతుకు బండికి సారధులై....

ఆఖరి మజిలిలో
ఆరడుగుల నేలను 
ఆనందంగా చేరాలనే ఆకాంక్షను...
అణువణువూ నింపుకున్నారు 
ఈ "ఆది దంపతులు"...!!

.

కామెంట్‌లు