భగవంతుని చిరునామా;- సి.హెచ్.ప్రతాప్
 భగవంతుడిని ఏ విధంగానైనా అర్చించవచ్చని మన ధర్మశాస్త్రాలు విపులంగా చెప్పాయి.ఆయనను  పూజించే అనేక మార్గాలను శాస్త్రాలలో సూచించబడ్డాయి.వాటిలో సగుణ, నిర్గుణ మార్గాలు ప్రధానమైనవి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమ్‌ అనే నవవిధ భక్తి మార్గాలను భాగవతం  ప్రతిపాదించింది.వీటిలో ఏ మార్గానైనా ఎంచుకొని, భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో అనుసరిస్తే భగవంతుని భక్తి, తద్వారా ఆయన యొక్క అపూర్వ క్రుణా కటాక్షాలను సాధించుకోవచ్చునని భాగవతం చెబుతోంది. అయితే ఇందులో 'ఆత్మనివేదనం' నిర్గుణ భక్తిని సూచిస్తుంది. దీనికి కూడా సగుణారాధనలో 'బలిచక్రవర్తి'ని ప్రముఖంగా చెప్తారు. కానీ దీన్ని హృదయ సంబంధిగా, మనిషి అంతర్ముఖత్వంతో సాధించే ఆత్మసాధనగా చెప్పవచ్చు. నిరాకారతత్వంలో కూడా భగవంతుని చిరునామాను మనవాళ్లు ప్రతిపాదించారు.
శ్లో: నతత్ర చక్షుర్గచ్ఛతి.. నవాగ్ గచ్ఛతి నోమనః
పరమాత్మ ఇట్టివాడు అని కన్నుల చేత, వాక్కు, మనసు చేత తెలుసుకోలేమని దీని అర్థం. అంతేకాదు..
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ
ఎవరిని వర్ణించలేక వాక్కు, చేరలేక మనసు విఫలమవుతాయో అతడే పరమాత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేవుడు పైన (ఊర్థ్వలోకాల్లో) ఉన్నాడని చాలామంది వాడుక భాషలో  అంటుంటారు. యోగశాస్త్రం ప్రకారం అయితే అది సహస్రార చక్రం వైపు చూపే సంకేతం. ఇంతకీ పరమాత్మ ఎక్కడుంటాడు అంటే..
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావ కః
యద్గ త్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ
..అన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. 'ఆ బ్రహ్మ పదాన్ని సూర్యుడు ప్రకాశింప చేయలేడు. చంద్రుడూ ప్రకాశింప చేయలేడు. అగ్నికూడా ప్రకాశింప చేయజాలడు. ఏ స్థానం పొందాక తిరిగి జన్మకు రాకుండా ఉంటారో అదే నా పరమపదం' అని దీని అర్థం. 
 స్వామీ! నీ కథలు చెవిసోకితే సంతోషించని వాడు, పుణ్యాత్ములు నీ పూజచేస్తే చూచి ఉత్సాహపడనివాడు, భక్తులు నిన్ను పొగిడితే పరవశించనివాడు, అంతరాత్మలో నిన్ను స్మరించక కాలమంతా వ్యర్థ పుచ్చేవాడు. ప్రపంచంలో వ్యర్థుడే. వాడు వ్యామోహియై చెడిపోతాడు సుమా! భగవంతుని సత్క్థలు వింటే పులకించి పోవాలి. భగవత్ పూజ వల్ల ఉత్సాహం పరుగులెత్తాలి. భగవంతుని స్మరిస్తే పరవశించిపోవాలి. భగవంతుని పట్ల నిత్యోపాసన లేనివాడు చెడిపోతాడు అని శేషప్పకవి శ్రీ నరసింహ శతకములో హెచ్చరిస్తున్నాడు.
 

కామెంట్‌లు