వైవిధ్యమైన ప్రక్రియ ముత్యాల హారం
🔹 ముత్యాల హారం ప్రక్రియలో శతకం పూర్తి చేసిన కవులు యాభై.
🔹 ముత్యాల హారం ప్రక్రియలో ముద్రితమైన పుస్తకాల సంఖ్య పది.
🔹 రెండు వేలకు పై చిలుకు ముత్యాల హారాలు రాసిన కవులు ఐదు
🔹 ఈ ప్రక్రియ నిర్వహణ ఉట్నూర్ సాహితీ వేదిక


రెండు వేల సంవత్సరాలకు పైగా ప్రాచీన చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష. తెలుగు భాషలో ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు పద్య, గద్య ,కథ, కథానిక, నవల, గల్పిక, వ్యాసం ఆత్మకథ , జీవితచరిత్ర లాంటి ప్రక్రియలు ఎన్నో అందించబడ్డాయి. ఆధునిక కాలంలో సాహిత్యంలో మినీ కవితల రూపంలో అనేక సాహిత్య రూపాలు కవులచే రూపొందించబడ్డాయి .ఇది భాషా వినియోగానికి భాషా పరిపుష్టతకు సహకారముగా నిలుస్తున్నాయి. నానీలు,నానోలు,రెక్కలు, దోహాలు,మణిపూసలు, మెరుపులు, కైతికాలు ,హైకూలు, తేనియలు ,ఇష్టపదులు, తదితర సాహితీ రూపాలను సొంతం చేసుకున్న కవులు ఆయా ప్రక్రియలలో విరివిగా రచనలు చేస్తూ పుస్తకాలను వెలువరిస్తుండటం అభినందించదగిన విషయం .అదే కోవలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్ గారు నాలుగు పాదాలతో కూడిన   ముత్యాల హారం
అనే సాహిత్య రూపాన్ని సాహితీ లోకానికి అందించారు. ఈ నాలుగు పాదాలు అంత్యప్రాస కలిగి ఉండి ,ప్రతిపాదంలో 10 నుండి 12 మాత్రలు ఉండాలి. నాల్గు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి.
హోలీ పండుగ సందర్భంగా పిల్లలు జాజిరి జాజిరి అని పాడుతూ వీధులు తిరుగుతుంటే ఆ పాట రాథోడ్ శ్రావణ్ గారిలో ఒక కొత్త ఆలోచనకు నాంది పలికింది. ఆ ప్రేరణతోనే ముత్యాల హారం సాహిత్య రూపాన్ని రూపొందించినట్లు వారు ప్రకటించారు. సాహితీరూపాన్ని ప్రకటించడమే కాకుండా ముత్యాల హార వేదిక అనే వాట్సాప్ సమూహమును ఏర్పాటు చేసి అనేక మంది కవులు చేత ముత్యాల హారాలను రాయిస్తున్నారు.ముత్యాల హారం సాహిత్య రూపంలో మొట్టమొదటి సంకలనం హరితహారం కు ముత్యాల హారం  రెండో సంకలనం  ప్రముఖ బాల సాహితీవేత్త గద్వాల సోమన్న ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా గారు రచించిన‌ బాలల ముత్యాల- హారాలు, ముత్యాల హారాలు- జీవిత సత్యాలు, సుభాషితాలు-ముత్యాల హారాలు మొదలగు పేర్లతో మూడు పుస్తకాలు వెలువరించారు. ఆశ్రమ ఉన్నత పాఠశాల ఎ.జి.హెచ్.యస్.డి గొల్లగూడెం, దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు బాణోత్ చెన్నారావు   చెన్నావారి ముత్యాల హారాలు అనే పుస్తకం రాశారు. ముత్యాల హారం రూపకర్త, రచయిత, ఉపన్యాసకులు ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్  రచించిన పుస్తకం పండుగలు ముత్యాల హారాలు అనే శీర్షికతో మన భారతీయుల అందరి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వెలువరించిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి యందు ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో అధ్యక్ష ప్రధానకార్యదర్శులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్,ముంజం జ్ఞానేశ్వర్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి రవీందర్ కుమార్ గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించ బడటం ముదావహం.

కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సాహితీ మూర్తి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, బాలసాహితీవేత్త గుర్రాల లక్ష్మారెడ్డి  గారు ముత్యాల హారం ప్రక్రియలో  వెన్నెల ముత్యాల హారాలు పుస్తకాన్ని  ముద్రించి ఘనంగా ఆవిష్కరించారు.  ఆదిలాబాదు జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి శ్రీమతి జ్యోతి వైద్య  గారు జ్యోతి కిరణాలు పేరుతో ముత్యాల హారాల సంపుటిని మన ముందుకు తీసుకొచ్చారు.ఇది వారి తొలి కవితా సంపుటి.ఆ తదుపరి ఇలా చాలామంది కవులు ముత్యాల హారం సాహిత్య రూపంలో  శతకాలు రాయడం జరుగుతుంది. ఇలా శతాధిక ముత్యాల హారాలు లిఖించిన కవులకు ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో సాహితీ ముత్యాల హార పురస్కారం వేదిక ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరామ్ వాట్సాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఐదువందలు ముత్యాల హారాలు లిఖించిన కవులకు ముత్యాల హారం శిరోమణి పురస్కారం వేయి గాని అంతకంటే ఎక్కువ గాని లిఖించిన కవులకు సహస్ర రత్న ముత్యాల హార పురస్కారం రూపకర్త రాథోడ్ శ్రావణ్ సౌజన్యంతో ప్రదానం చేయడం అభినందించదగ్గ ‌విషయం.
విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి వైద్య గారి జ్యోతి కిరణాలు పేరుతో అందించిన కొన్ని 
ముత్యాల హారాలు

"అక్షరాలది సమరం
పదాలతో పయనం 
కూర్పేమో అద్భుతం
ముత్యాలహార గమనం"   నాలుగు పాదాలలో ముత్యాల హారాన్ని చక్కగా చిత్రీకరించారు.

సహనం నీకుంటే 
సర్వం నీ వెంటే 
వినయం నీకుంటే 
విజయం నీ వెంటే
ఏది జరిగిన మనిషి సహనాన్ని కోల్పోవద్దు. వినయాన్ని దూరం చేసుకోవద్దు. సహనం వినయం ఉంటే విజయం తథ్యమని అలతి పదాలతో అందించిన రీతి ప్రశంసనీయం.

నేటి సమాజంలో మానవ బంధాలని ఎలా ఉన్నాయో చక్కగా మనకందించినదీ ముత్యాల హారం. 
"ఈ తరం బంధాలు 
సూర్యముఖి పువ్వులు 
ఎటు ఉంటె లాభాలు 
అటు విరిసే నవ్వులు
ఇలా ముత్యాల హారం ప్రక్రియలో బహు చక్కని ముత్యాలు ఉన్నాయి.
 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు ముత్యాల హారాలు రాయడం  హర్షించదగ్గ విషయం.  అందమైన అంత్యప్రాసలతో చాలా సరళమైన ప్రక్రియను రూపొందించిన రాథోడ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ ప్రక్రియ మరింత బహుళ ప్రాచుర్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు కవుల 
కలం నుండి మరిన్ని వచన కవితా సంపుటాలు వెలువడాలని కోరుకుందాం...

డా. వైరాగ్యం ప్రభాకర్
కవి, రచయిత, విమర్శకులు
కరీంనగర్.9014559059


కామెంట్‌లు
Unknown చెప్పారు…
ముత్యాలహార ప్రక్రియ, రూపకర్త రాథోడ్ శ్రావణ్ గురించి చాలా చక్కగా వివరించిన గౌ డా.వైరాగ్యం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ