సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-30
కరి కపిత్థ న్యాయము
*****
కరి అంటే ఏనుగు.కపిత్థ అంటే వెలగ పండు.
ఏనుగు మింగిన వెలగపండు పైకి చూడటానికి పండులాగే ఉంటుంది కానీ లోపలి గుజ్జంతా హరించబడుతుంది.దీనినే కరి కపిత్థ న్యాయము అంటారు.
దీనికి చక్కని ఉదాహరణగా సుమతీ శతక కర్త " సిరి దా వచ్చిన వచ్చును/ సలలితముగా  నారికేళ సలిలము భంగిన్/సిరి తా బోయిన బోవును/ కరి మింగిన వెలగపండు కరిణిని సుమతీ " అంటాడు.
సిరి లేదా సంపద తెలియకుండానే కొబ్బరి కాయ లోకి నీరు వచ్చినట్లు వస్తుంది. అలాగే సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు లేదా గుంజు మాయమైనట్లే హరించుకు పోతుంది.
ఇలా పైకి గంభీరంగా పటాటోపం ప్రదర్శించేవారు కొందఱు ఉంటారు.వారిని చూసి చాలా గొప్పగా అంచనా వేస్తుంటాం.
"మా తాతలు నేతులు తాగారు - మా మూతులు వాసన చూడండి అన్నట్లు" కనిపించినా లోపల మాత్రం ఏమీ ఉండదు.ఉత్త డొల్లతనం,లేమి తనం తప్ప.అలాంటి వారికి ఉదాహరణగా ఈ" కరి కపిత్థ న్యాయమును" చెప్పవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు