లేత గులాబిపువ్వులు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
లేతలేత గులాబీలు
లే లెమ్మంటున్నాయి
రా రమ్మంటున్నాయి
రెపరెపలాడుతున్నాయి

ముద్దుముద్దు గులాబీలు
ముట్టుకోమంటున్నాయి
మత్తును చల్లుతున్నాయి
మయిని మరిపిస్తున్నాయి

ఎరుపు గులాబీలు
ఏమరుస్తున్నాయి
ఎదను తడుతున్నాయి
సొదలు చెప్పమంటున్నాయి

గులాబీ పువ్వులు
గుబాళిస్తున్నాయి
గుబులు పుట్టిస్తున్నాయి
గుండెను మీటుతున్నాయి

తాజా రోజాలు
తళతళలాడుతున్నాయి
తలపులులేపుతున్నాయి
తరుణితలలో తురుమమంటున్నాయి

చక్కని గులాబీలు
దండను అల్లమంటున్నాయి
తెలుగుతల్లిమెడలో వెయ్యమంటున్నాయి
తెలుగువెలుగులను చిమ్మమంటున్నాయి

గులాబీ మొగ్గలు
గుసగుసలాడుతున్నాయి
ముద్దులు కురిపిస్తున్నాయి
మాటల్లో ముంచేస్తున్నాయి

విచ్చుకున్న గులాబీలు
వినోదపరుస్తున్నాయి
ముళ్ళను గుచ్చుతున్నాయి
కళ్ళను కట్టిపడేస్తున్నాయి

గులాబీల మరవను
గులాబీల వదలను
గులాబీల గురుతులను
గుండెలో పదిలపరచుకుంటాను

గులాబీలు అందించిన
గుట్టుగా ప్రేమనుతెలిపిన
గుండెలో గుబులుపుట్టించిన 
గుమ్మకు కృతఙ్ఞతలు అభివందనలు


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Very very nice kavita on roja flowers.
Congratulations Rajendra Prasad garu