ఎందుకు ఎందుకు?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వులుపూయని 
మొక్కలు
కాయలుకాయని 
చెట్లు ఎందుకు?

నవ్వులులేని
మోములు
వానలుకురవని
మబ్బులు ఎందుకు?

నీరులేని
ఏరులు
పిల్లలులేని
ఇండ్లు ఎందుకు?

జాబిలిలేని
రాత్రులు 
సుఖములేని
బ్రతుకులు ఎందుకు?

శుష్క
మాటలు
వ్యర్ధ
పనులు ఎండుకు?

నోటికి
దురద
వంటికి
బురద ఎందుకు?

మదిలోని
ఆలోచనలను 
హృదిలోని
భావాలను తెలుపని మనసులు ఎందుకు?

అలరుల
అందాలను
ఆస్వాదించని
ఆసాములు ఎందుకు?

ప్రకృతి
పొంకాలను పరికించని
పరవశం పొందని
ప్రాణులు ఎందుకు?

చక్కని
చందములను
చూపని
చిత్తరువులు ఎందుకు?

కన్నీటికి
కరగిపోని
కరుణచూపని
కుసంస్కారులు ఎందుకు?

తేటతేట పదాలతో
తెల్లవారి వెలుగులాంటి
తేనెనెచుక్కలు చిందేటి
తెలుగునుపలుకని తెలుగోళ్ళు ఎందుకు?

కమ్మని
కవితలను
కూర్చని
కలములు ఎందుకు?

క్షరరహితములను
క్రమముగా
కాగితాలపై
కూర్చోపెట్టని కవులు ఎందుకు?

అంతరంగాలను
అంటని
ఆలోచనలను
రేపని అనవసరపు వ్రాతలు ఎందుకు?


కామెంట్‌లు