నెల్లూరులో మహాత్మాగాంధీ ; -కొప్పరపు తాయారు
 1915 సంవత్సరం మే నెల 4,5,6 తేదీల్లో మహాత్మాగాంధీ నెల్లూరులో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ మహాసభలో పాల్గొనడానికి ఆయన వచ్చిన సందర్భంగా ఆయన దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటాన్ని అభినందిస్తూ సన్మానం కూడా చేశారు.
అప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టరుగా రామచంద్రరావు ఉండేవాడు. ఉద్యోగరీత్యా బ్రిటిష్ వారి కొలువులో ఉన్నా ఈయనకు మహాత్మాగాంధీ అంటే చాలా అభిమానం. గాంధీ అన్నా ఆయన సిద్ధాంతాలు అన్నా అభిమానం ఉన్న ఈయన కలెక్టరుగా ఉన్న కాలంలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేసే ఉద్యమాలను చూసీ చూడనట్లు వదిలేసేవాడు.

గాంధీ నెల్లూరు స్టేషనులో దిగగానే వెళ్లి ఆయన దర్శనం చేసుకుని తన గురించి చెప్పుకుని, తన బంగళాలో విడిది చేయమని అభ్యర్ధించాడు. “బాబూ నేనంటే నీకు ఎంత అభిమానం ఉన్నా నువ్వు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉన్నావు. నీ ఇంట్లో నేను దిగితే నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని సున్నితంగా తిరస్కరించారు గాంధీ. అయినా రామచంద్రరావు వినకుండా పట్టుబట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ మూడు రోజుల్లో ఒక రోజు గాంధీగారి కోసం స్థానిక కళాకారులతో భక్త ప్రహ్లాద నాటకం తన బంగళాలో ఏర్పాటు చేశాడు రామచంద్రరావు. సమావేశాలు ముగించుకుని గాందీగారు తిరిగి వెళ్ళిన తరువాత తన పై అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాడు రామచంద్రరావు. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీకి తన బంగళాలో వసతి కల్పించినందుకు తనమీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పమని ఆ నోటీసు.
ఈ పరిమాణం ముందుగానే ఊహించిన రామచంద్రరావు దానికి సమాధానం వెంటనే పంపించాడు. గాందీగారు ఎక్కడో ఉంటే ఆయనను ఎవరు కలుసుకొంటున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఆయనను నా దగ్గర ఉంచుకుని ఎవరెవరు ఆయనను కలుసుకున్నారో జాబితా తయారుచేసి, వారి మీద నిఘా ఏర్పాటు చేశాను”అని సమాధానం పంపి, అందరికీ తెలిసిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లతో జాబితా తయారుచేసి దానికి జతచేసి పంపించాడు రామచంద్రరావు. దానితో రామచంద్రరావు మీద చర్యలు తీసుకోవడానికి ఏమీ కారణం లేక వదిలేశారు బ్రిటిష్ ప్రభుత్వం వారు. వివిధ జిల్లాలలో పనిచేసి పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు రామచంద్రరావు.
2015లో గాంధీగారి పర్యటన జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు గ్రామంలో ఉన్న పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వారు మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ ముఖ్య అతిధిగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆశ్రమాన్ని 1921లో నెల్లూరు జిల్లాలో తన రెండవ పర్యటన సందర్భంగా మహాత్మాగాంధీ గారు ప్రారంభించారు.

కామెంట్‌లు