భగవంతుని తత్వం;- సి.హెచ్.ప్రతాప్
 భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొన్నవారు అరుదే. నేటి కాలంలో భగవంతుని గూర్చి మిడి మిడి జ్ఞాతంతో తమకు అన్నీ తెలుసనుకెనేవారే ఎక్కువగా వుంటారని శ్రీ కృష్ణుడు ఆనాడే మానవాళిని హెచ్చరించాడు. అసలు భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అన్న సందేహం మాత్రం అందరికీ ఉంటుంది. కాని భగవంతునికి ఆకారం లేదు. నామం లేదు. సృష్టికి కారణకారుడు మాత్రం పరాత్పరుడే అంటారు. జ్ఞానులంతా ధ్యానం చేసి ఏకాగ్రతతో భగవంతుడిని మెప్పించి తమ చర్మచక్షువులతో చూసినవారున్నట్లు పురాణాలు చెబుతాయి. భగవంతుడిని చూడాలనుకొంటే మంచి మార్గము, సులభమైనది భక్తి ఒక్కటే అసలు సిసలైన సాధనం. తపో,జ్ఞాన మార్గాలున్నప్పటికీ ఇవి చాలా కష్టంతో కూడుకొన్నవి. ఎన్నో వేల సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రయత్నించినా  ఫలితం దొరుకుతుందన్న నమ్మకం లేనివి. భక్తిమార్గంలో మాత్రం తప్పక భగవంతుడు మనకు వ్యక్తమవుతాడు. పైగా కోరుకున్న రూపాన్ని కూడా అపాదించుకుని మరీ భగవంతుడు కనిపిస్తాడు అన్న నమ్మకమున్న మార్గమిది.
భక్తిసామ్రాజ్యంలో భగవంతుడిని చూచినట్లు చెప్పడానికి భగవంతుని తమ అనుభవంలోకి తెచ్చుకున్నవారు ఎందరో కనిపిస్తారు.
రామకృష్ణ పరమహంస తన జీవితాన్ని కాళికామాతకే అర్పించాడు. తన భార్యను సైతం ఆది పరాశక్తిగానే భావించాడు. ఆ పరాశక్తి రామకృష్ణ పరమహంసకు కనిపించింది. అతని చేత ఎన్నో ఉపచారాలను పొందింది. అతనిని ఒక మహా యోగిగా తీర్చి దిద్దింది.
భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి భాగవతుల సేవ కూడా ముఖ్యమే. భాగవతుల సేవలు భగవంతుడు మెచ్చుతాడు. త్రిలోక సంచారి నారదుడు కూడా భాగవతుల సేవ చేసి నారాయణ మంత్రాన్ని పొంది నిత్యమూ నారాయణ జపంతో త్రిలోకాలు తిరిగే శక్తిని సంపాదించుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.  అటువంటి భగవంతుడిని చూడాలనుకొంటే ముందుగా సమత్వబుద్ధిని, విశాల భావాన్ని పెంపొందించుకోవాలి. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవాలి. సర్వం పరాత్పరుని రూపంగా భావించాలి. సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అలవరచుకోవాలి.

కామెంట్‌లు