అలా ఉండొద్దని అనడం లేదు!;-- యామిజాల జగదీశ్
 ఈరోజుల్లో తప్పక గుర్తుంచుకో వలసిన  విషయం ఒకటుంది.
కొందరు అన్యాయంపట్ల కరుణ చూపడం. జాలిపడి ఆదుకోవడం. అనంతరం మాట పడటం....
మనం ఏ ఊరుకి వెళ్ళినా అక్కడ బతికి చెడిన వ్యక్తంటూ ఒకడు కచ్చితంగా ఉంటాడు.
సంపద బోలెడంత ఉండి ఉంటుంది.
అడిగినవారికీ ఆడగనివారికీ అనే తేడా లేకుండా తన వంతు సాయం చేసి ఉండొచ్చు. దానాలతో పుణ్యం మూటకట్టుకున్న ఆ మనిషి స్థితి ఓరోజు దారుణంగా మారిపోవచ్చు.
గొప్ప దాత అని నలుగురితో అనిపించుకున్న ఆ వ్యక్తి స్థితి దారుణంగా ఉండవచ్చు.
ఆ మనిషి వద్ద సాయం పొందడానికి వచ్చిన వారో, సాయం పొందిన వారో తీరా ఆ వ్యక్తి స్థితిగతులు తెలిసినా ఆదుకోవడానికి ముందుకు రారు. 
ఓ విషయం బాగా తెలిసొస్తుంది. 
ఒకరెంత మంచివారిగా ఉన్నారో ఆ మనిషినే ఈ సమాజం పిచ్చిమాలోకంగా చూస్తుంది. చెవులు కొరుక్కుంటుంది. అతను మంచి మనిషే. కనుక అతను మంచిగా బతకాలని అనుకోదీ లోకం. అతని దగ్గర వీలైన మేరకు దోచుకోవాలనే అనుకుంటుంది. 
అతను మంచిగా బతికున్న రోజులలో మేము మీకు రుణపడి ఉన్నామండీ..ఎలా రుణం తీర్చుకోవాలో తెలీడం లేదండీ అని ఆ సమయానికి ఏవేవో మాటలంటారు. కానీ ఆ మాటలేవీ తర్వాతికాలంలో జ్ఞాపకానికి రావు. ఒకవేళ జ్ఞాపకమున్నా మిన్నకుండి పోతారు. అందుకే అటువంటి మాటలకు ఉప్పొంగిపోకూడదు.
ఓ మంచి మనిషి సాయం పొందడం కోసం ఓ నాలుగు మాటలు చెప్తారు. అవేవీ ఆచరణలో కనిపించవు. సాయం పొందాక వారి వంక కన్నెత్తిచూడరు. చెత్తాచెదారాన్ని పారేసినట్టు విసిరికాడతారు. వ్యంగ్యంగా చెప్పుకుంటారు.
అలాగని మంచివారనే వారొక్కరూ లేరనడానికి వీల్లేదు. ఉంటారు, కానీ ఆ సంఖ్యను వేళ్ళమీద లెక్కించొచ్చు. పొందిన సాయాన్ని మరవని వారుంటారు ఒకరిద్దరు.
మంచివారిగా ఉండమని అనడం లేదు.
కరుణాసాగరుడై ఉండొద్దనడం లేదు. కానీ ఎవరితో ఎప్పుడెలా ఉండాలో తెలిసుండాలి.
అది చాలా చాలా ముఖ్యం. 

కామెంట్‌లు