అన్నయ్యా! ఆటాడవా? సరికొండ శ్రీనివాసరాజు.-సెల్ నం. 8008848703.
 వాసు చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడేవాడు. స్నేహితులతో కలిసి ప్రతిరోజూ గంటల తరబడి క్రికెట్ ఆడి వచ్చేవాడు. సెలవు రోజుల్లో పూర్తిగా ఇంటిపట్టున ఉండేవాడు కాదు. సోము చెల్లెలు సిరి తెలివైన విద్యార్థిని. ఇంటి వద్ద ఏ రోజు హోంవర్క్ ఆరోజు త్వరగా పూర్తి చేసేది. తరచూ అన్నయ్యను బతిమాలేది తనతో కలిసి ఆడుకోమని. తనతో ఆడుకునే వారు ఎవరూ లేరని. "జోకులు వేస్తున్నావా? నీతో ఆడే ఆటలు ఏముంటాయి. నన్ను విసిగించకు." అని విసుక్కునేవాడు. సిరి తీరిక సమయాల్లో కథల పుస్తకాలను చదువుకోవడం అలవాటు చేసుకొని, ఇరుగు పొరుగు తన ఈడు అమ్మాయిలతో రకరకాల ఆటలు ఆడేది. 
       ఒకరోజు తల్లి బలవంతాన చెల్లెలితో క్యారమ్ బోర్డు ఆడినాడు వాసు. చెల్లెలి చేతిలో ఓడిపోయి, దానిని అవమానంగా భావించి, చెల్లెలిని కొట్టినాడు. భోరున ఏడ్చింది సిరి. తల్లిదండ్రులు వాసును బాగా తిట్టారు. దాంతో ఇంటికి రాకుండా బయట ఆటలు ఆడటం ఎక్కువైంది. 
       ఒకరోజు వాసు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. 49 పరుగులతో ఆడుతున్న సోమును ఔట్ చేశాడు వాసు. అర్థ సెంచరీ మిస్ అయిన సోము కోపంతో వాసును కొట్టాడు. వాసు తిరిగి సోమును దారుణంగా కొట్టాడు. స్నేహితులు నలుగురైదుగురు కలిసి తిరగబడి వాసును చితక బాదినారు. రక్తాలు కారుతూ ఇంటికి వచ్చిన వాసును చూసి కంగారు పడిన తల్లిదండ్రులు ఏమైంది అని అడిగారు. వాసు జరిగింది చెప్పాడు. వాళ్ళకు బుద్ధి చెప్పమని తల్లిదండ్రులను వేడుకున్నాడు.
       "చూడరా వాసు! మేము చెప్పిన మాట వినకుండా చెడు సావాసాలు పట్టినందుకు నీకు తగిన శాస్తి జరిగింది. ఎప్పటికైనా బయటి వాళ్ళు బయటి వాళ్ళే. ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపం తెలిసిందా? నీ విలువైన సమయాన్ని వృథా చేయించేవాళ్ళు ఎప్పుడూ నీకు శత్రువులే. ఓటమిని తట్టుకోలేక నువ్వు నీ చెల్లెలిని కొట్టావు. సోము నిన్ను కొట్టాడు. సోముకు నీకు తేడా ఏముంది చెప్పు. నీ చెల్లెలు కాబట్టి నిన్ను తిరిగి కొట్టలేదు. ఇప్పటికైనా మంచి చెడులు తెలుసుకో." అన్నది తల్లి. సోము ఇంటిపట్టునే ఉంటూ చెల్లెలితో ఆటలు ఆడుతున్నాడు. కథలు చదువుతున్నాడు. చెల్లెలిని చూసి పట్టుదలతో చదువుకోవడం నేర్చుకున్నాడు.
 .

కామెంట్‌లు