ఒకూర్లో ఒక ధనవంతుడైన నవాబుండేటోడు. పండుగ దగ్గర పడడంతో వానికి ఇంట్లో అందరికీ బంగారు బట్టలు కుట్టియ్యాలని అనిపించింది. నవాబు తలచుకుంటే కానిదంటూ ఏముంటుంది. దాంతో వెంటనే నేత వాళ్ళని పిలిపించి సన్నని తీగతో చూడముచ్చటగా బంగారు బట్టని నేయమన్నాడు. సరే అని వాళ్ళు రాత్రనకా... పగలనకా... కిందామీదాపడి నవాబింట్లో వున్న వాళ్ళందరికీ సరిపడేంత బంగారు బట్టను నేసిచ్చి బహుమానాలు అందుకోని వెళ్ళిపోయినారు.
బట్ట తయారయిపోయింది గదా... ఇంక దాన్ని ఎవరితో కుట్టియ్యాలా అని నవాబు ఆలోచనలో పడినాడు. ఆ వూర్లో రాజాక్ అని ఒక దర్జీ వున్నాడు. వానంత పనిమంతుడు ఆ చుట్టుపక్కల వూళ్ళలో యాడా లేడని పేరు. కానీ... వానికో చిన్న చెడ్డలవాటు వుంది. అదేమంటే... వాడు నవాబుదయినా... ఫకీరుదయినా... గరీబుదయినా... అమీరుదయినా... బట్టలు కుడతా కుడతా అందులోంచి కొంచమైనా మట్టసంగా కాజేసేటోడు. తరువాత అట్లాంటి ముక్కలన్నీ కలిపి రంగురంగుల బట్టలు అందంగా తయారు చేసి కొడుకుకి ఇచ్చేటోడు.
రజాక్ చేతి వాటం గురించి నవాబుకు బాగా తెలుసు. ఏదో పోనీలే అని చూస్తా వూరుకోడానికి ఇది మామూలు బట్ట కాదు గదా... బంగారుది. దాంతో బాగా ఆలోచించి... బట్టను రజాక్ దగ్గరికి పంపకుండా... రజాక్ నే దివాన్ కు పిలిపించి “చూడు... రేపటి నుండి నీవు నీ కుట్టు యంత్రం ఎత్తుకోనొచ్చి ఈడ పెట్టుకోని... మా బట్టలన్నీ ఈన్నే కుట్టు" అని ఆజ్ఞాపించినాడు. నవాబు చెప్పినాక తప్పదు గదా... దాంతో తరువాత రోజు రజాక్ కుట్టు యంత్రం తీసుకోనొచ్చి నవాబు గారింట్లోనే పని మొదలు పెట్టినాడు.
ఆ నవాబు పనీపాటా మానేసి రజాక్ చిన్నముక్క గూడా ఎత్తుకోని పోకుండా స్వయంగా ఆయనే కాపలా కాయడం మొదలు పెట్టినాడు. రజాక్ పొద్దునొస్తే మళ్ళా చీకటి పడేంతవరకూ అక్కన్నే వుండేటోడు. మధ్యాన్నం చిన్నకొడుకు రజాక్ కోసం అన్నం కూరలు తెచ్చిచ్చేటోడు. పనంతా అయిపోగానే సాయంత్రం సైనికులు నవాబు ఎదుటనే పైనుండి కింది వరకూ అంగుళం కూడా వదలకుండా వెదకి పంపించేటోళ్ళు. దాంతో ఎంత ప్రయత్నించినా రజాక్ చిన్నముక్క కూడా కాజేయలేక పోయినాడు.
ఎట్లా నా కన్నుగప్పి కొట్టేస్తాడో చూద్దామని నవాబూ... కొంచమన్నా కొట్టేయకపోతే ఈ బతుకెందుకని రజాకూ... పంతం బట్టి కూచున్నారు. ఒకొక్క రోజు గడుస్తా వున్న కొద్దీ రజాక్ కి అన్నం గూడా తినబుద్ది కావడం లేదు. రాత్రి ఎంత పన్నుకున్నా నిద్ర వచ్చేది కాదు. రోజురోజుకీ చిక్కిపోసాగినాడు. అది చూసి వాని పెండ్లాం విషయం కనుక్కోని ఆలోచిస్తా వుంటే ఆఖరికి ఆమెకో ఉపాయం తట్టింది. దాంతో వెంటనే మొగుని దగ్గరికి పోయి ఏం చేయాల్నో చెప్పింది. ఆ మాటింటానే దర్జీ మొగం ఆనందంతో వెలిగిపోయింది. కొడుకును పిలిచి చేయాల్సిందంతా చెప్పినాడు. ఆరోజు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయినాడు.
తరువాత రోజు ఎప్పట్లాగే నవాబు గారి దివాన్లో బట్టలన్నీ ముందు వేసుకోని కుట్టసాగినాడు. అట్లా కుడతా కుడతా... నవాబు తన పెండ్లాంతో మాట్లాడతా వున్నప్పుడు... బెరబెరా... ఒక పెద్ద బట్టముక్కను మట్టసంగా మడత మీద మడత... మడత మీద మడత పెట్టి కనబడకుండా కాలికేసుకునే జోడు లోనికి బాగా లోపలికి తోసేసినాడు.
మధ్యాన్నం అన్నం తినే సమయమయింది. రోజూ మధ్యాన్నం కాగానే అన్నం తీసుకోని పరిగెత్తుకోనొచ్చే కొడుకు ఆ రోజు ఎంత సేపయినా రాలేదు. అది చూసి నవాబు "ఏరా... నీ కొడుకింకా రాలేదు" అన్నాడు. దానికి వాడు “యాడ తిరుగుతున్నాడో... ఏమో... వస్తానే వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దితే రేపట్నించి యాడున్నా సమయానికి సరిగ్గా వస్తాడు" అంటా కొడుకును పని చేస్తూనే తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడం మొదలు పెట్టినాడు.
పన్నెండు దాటితే వచ్చే కొడుకు ఒకటయినా రాలేదు... రెండయినా రాలేదు... మూడయినా రాలేదు.... అది చూసి నవాబు "రేయ్... ఇంగ నీ కొడుకు రాడుగానీ... లోపలికి పోయి... బేగాన్ని అడిగి ఒక ముద్ద పెట్టిచ్చుకోని తిని రాపో" అన్నాడు.
దానికి రజాక్ “ఇంత సేపు ఆగినా గదా... ఇంకో అరగంట చూస్తా... అప్పటికీ రాకుంటే నీవు చెప్పినట్టే చేస్తా... అయినా వీడు మట్టసంగా ఇచ్చినేది ఇచ్చినట్టు తీసుకొని సక్కగా రాకుండా మధ్యలో ఆడా ఈడా గప్పాలు కొడతా వుంటాడు. ఈ నడుమ చెడు సావాసాలు కూడా బాగా ఎక్కువయినాయి.... రానీ... వస్తానే జోడు తీసుకొని కొట్టినచోట కొట్టకుండా కిందామీదా ఏసి కొడితే అప్పుడొస్తాది బుద్ది వానికి" అన్నాడు కోపంగా.
సరిగ్గా... అట్లా రజాక్ కోపంతో వూగిపోతా వున్నప్పుడు వాని కొడుకు అన్నం మూట వూపుకుంటా లోపలికి వచ్చినాడు. వాన్ని చూస్తానే రజాక్ కోపంగా పైకిలేచి “సిగ్గులేని ఎదవా! ఎక్కడుంటివిరా ఇంత సేపు... ఇక్కడ ఆకల్తో సస్తావుంటే బాతాఖానీలు చేస్తున్నావా దారిమీద" అంటూ జోడు తీసుకోని వాన్ని రపారపా రెండేట్లు పెరికినాడు.
ఆ దెబ్బలకు వాడు ఏడుస్తా "అమ్మ.... వంట చేయడం ఆలస్యమయితే.. అమ్మను తిట్టాలగానీ... నన్ను కొడతావా... వుండు నీపని చెప్తా” అని ఠక్కున వాని చేతిలోని జోడు గుంజుకోని "దీంతోనే గదా కొట్టింది... ఇప్పుడిది తీస్కోని పోతా... ఉత్త కాళ్ళతో వీధుల్లో నడుచుకుంటా రా... అప్పుడు బుద్ధి వస్తాది" అని "రేయ్... రేయ్... ఆగరా.. నాజోడు నాకియ్యిరా” అని వాళ్ళ నాయన అరుస్తున్నా వినకుండా అక్కన్నించి జోడు తీసుకొని పారిపోయినాడు.
అది చూసి నవాబు కిందామీదా పడి నవ్వుతా "ఒరే రజాకూ.. భలే కొడుకుని కన్నావురా... అయినా మంచీ చెడూ తెలుసుకోకుండా అంత తొందరేందిరా నీకు... ఇప్పుడు చూడు ఏమయిందో" అన్నాడు.
రజాక్ విచారంగా మొగం పెట్టి "ఏం చేద్దాం నవాబ్ ..... అంతా నా ఖర్మ" అన్నాడు తన పాచిక పారినందుకు లోపల్లోపల నవ్వుకుంటా...
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి