చెడ్డ వాడు; - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పుట్టుకలో నీచకులము ఉత్తమకులము  అంటూ రకరకాల గుణాలు ఉంటాయా?  ఎవరైనా సమాజంలో ఒక మంచి పని చేసిన వాడిని చూస్తుంటే మంచి కులంలో నుంచి వచ్చినవాడు రా అని పొగడ్తలతో ముంచి వేయడం ఎంతవరకు సబబు  అదే పొరపాటుగా ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు  వీడేదో నీచ కులంలో పుట్టి ఉంటాడు అని చెప్పడం  ఎంతవరకు ధర్మబద్ధం  సామాన్యుడు కూడా ఆలోచించవలసిన విషయం  కులానికి గుణానికి ఏమైనా సంబంధం ఉన్నదా?  ఏ వ్యక్తి అయినా తాను ఈ  కులంలో పుట్టాలి, ఆ కులంలో పుట్టాలి అని కోరుకుంటాడా?  ఒకవేళ వీరు కోరుకున్నా అలా జరగడానికి అవకాశం ఉందా  ఏ మానవుడు తన శరీరాన్ని వదిలిపోతాడో ఆ క్షణాన దానిలో ఉన్న జీవి మరో స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెప్పింది కదా.
సామాన్యంగా పల్లె ప్రజలు ఆ గ్రామంలో ఉన్న అందరిని  పరిశీలనగా చూస్తూ ఉంటారు ఎవరు మంచిగా ప్రవర్తిస్తున్నారు. గ్రామానికి కావలసిన విషయాల్లో ఎవరు జోక్యం చేసుకొని  మంచి సూచనలను ఇస్తూ  సహకరిస్తూ సాయపడుతూ ఉంటారు. వాడిని చూసి పెద్దవాళ్లు వాడి గుణం  దొడ్డగుణం రా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తారు.  ఆ మంచి పని చేసే వ్యక్తి  చేస్తున్న పనులను గురించి మాట్లాడుకుంటారు తప్ప అతని కులమేమిటి అతని భాష ఏమిటి అతని పూర్వీకుడు ఎవరు అంటూ అతని చరిత్రను గురించి ఎవరు మాట్లాడుకోరు. అలా  అందరి తలలో నాలుకలా ప్రవర్తిస్తూ ఉంటాడు  కనుక అతను అంటే అందరూ గౌరవిస్తారు  అతని వల్ల ఆ కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుంది. నీచ గుణం కలిగిన వ్యక్తి  ఆ గ్రామంలో అందరికీ నీచుడు గానే కనిపిస్తాడు అతను చేసే ప్రతి కార్యం  ఆ గ్రామానికి చెడు కలిగేలా చేస్తాడే తప్ప మంచి వాడి జన్మలో చేయడు. అలాంటివాడు ఎలాంటి ఉత్తమ  కులము నుంచి వచ్చినా వాడి బుద్ధిని గుడిసేటి గుణం  అని ప్రతి ఒక్కరూ నిరసిస్తారు  అతను ఏ పని చేసినా దానిని ఆ గ్రామంలో ఏ ఒక్కరూ పట్టించుకోరు  ప్రత్యేకించి అతని వయసులో ఉన్నవారు. అతని కన్నా పెద్దవారు అతనిని అసహ్యించుకుంటూ ఉంటారు.  ఇంకా ఆడపిల్లల విషయం చెప్పనవసరమే లేదు దగ్గరకు రావడానికి కూడా వాళ్ళు అంగీకరించారు అలాంటి నీచ గుణం ఉన్న వారిని ఎవరిని  చేరనివ్వకుండా వాడి గురించిన ఏ విషయము చెప్పకుండా ఉండడం ఉత్తమోత్తమము అని చెప్తున్నాడు వేమన ఎంతో అనుభవంతో రాసిన ఆ పద్యాన్ని  ఒకసారి చదవండి.

"గుణము గలవాని కులమెంచగానేల 
గుణము గలిగెనేని కోటి సేయు  గుణము లేని వాని కులమెంత గొప్పైన నెంచవలదు నీచుడెన్న..."



కామెంట్‌లు