సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -38
కూప కూర్మ న్యాయము
*****
కూపము అంటే బావి లేక నూయి.కూర్మము అంటే తాబేలు.
బావిలో ఉన్న తాబేలు ఆ బావినే సమస్త ప్రపంచమని భావిస్తుంది.
దానికి తన చుట్టూ ఉన్న చిన్న పరిధి తప్ప బయట ఉన్న విశాలమైన సముద్రం,నది లాంటివి ఏవీ తెలియవు.
అలాంటిదే కూపస్థ మండూకం లేదా "కూప మండూక న్యాయము"కూడా.
మండూకం అంటే కప్ప.బావిలో కప్ప కూడా తాను నివసించే బావినే సమస్త ప్రపంచం అనుకుంటుంది.
కొందరు వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. తమ చుట్టూ గీసుకున్న గిరిలోనో , ఇరుకైన ఆలోచనలతోనో బతుకుతారు.ఆలోచనల్లో వారి చుట్టూ ఉన్న పరిధిలోని చిన్న సమాజమే విశాల ప్రపంచంగా భావిస్తారు.బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో  తెలియకుండా ఉంటారు. వారి జ్ఞానము అంత వరకే పరిమితం.
 వారికి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా అర్థం చేయించినా తమ మనసులోని భావజాలాన్ని మార్చుకోరు.అంతకంటే మించి ఆలోచించడానికి  ఇష్టపడరు.
తమ జ్ఞాన పరిధిని పెంచుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపరు.
పైగా వారిలో ఒక విధమైన అహంకారం కూడా కనిపిస్తుంది. తమకే అన్నీ తెలుసన్న భ్రమ ఎక్కువగా ఉంటుంది .
ఇలా అందులోంచి బయట పడడానికి కానీ, సహేతుకం కాని ఆలోచనలను మార్చుకోవడం కానీ అస్సలు ఇష్టపడక, పరమ మూర్ఖత్వంతో  ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ న్యాయమును చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు