వేసవి సెలవులు;- ఎడ్ల లక్ష్మి
 వేసవికాలం " సెలవులు" బస్తీ నుండి పల్లెటూరికి ప్రయాణం అది ఎక్కడికనుకుంటున్నారా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ అమ్మమ్మ ఇంటిలో ఎన్నో రకాల పండ్లు ఫలాలు బుట్టల నిండా పెట్టినారు. అంతేకాదండోయ్ పిడకల దాలిలో పెట్టి కుండ నిండ కాచిన చిక్కనైన పాలు , ఒక గురిగి నిండ పెరుగు, కాచిన నెయ్యి తీసిన వెన్న ముద్దలు ఎంతో రుచికరంగా పెరటిలో కూరగాయ పాదులు బీరా, సొర, కాకర, దొండ, పొట్ల పందిరి నిండా పారి చెట్టు నిండా కాసిన కూరగాయలు. 
       
      ఏ రసాయనిక ఎరువులు వాడకుండా కాసిన కూరగాయలతో అమ్మమ్మ చేసిన వంటలు ఎంతో రుచిగా, పచ్చనైన చెట్లతో చల్లని గాలితో చక్కని వాతావరణం .
     ఇలా చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయింది, ఒకరోజు కోడి కూత పొద్దుకు ఒక వింతైన శబ్దము గుమ్మం ముందు వినిపిస్తుంది. అప్పుడు నిద్ర లేచి కూర్చున్నాను మా తాత కూడా లేచి ఎందుకు కన్నయ్య తొందరగా లేచావని అడిగాడు. 
తాత ఆ గుడుగుం గుడుగుం శబ్దం ఏమిటి ? 
అదా! బుడుబుడుక గిరిక శబ్ధం . ఇల్లిల్లు తిరిగి ఆ శబ్దం చేస్తూ, మబ్బుతో బిక్షం అడుకుంటారు . 
   అప్పుడే అమ్మమ్మ చాట నిండా ధాన్యముతో వెలపలకు వెళ్లి అతని జోలలో పోసింది . 
  ఇంకాస్తసేపటికి చెట్టు మీద పక్షులు కిలకిల రాగాలు చేస్తూ రెపరెపమని లేచి జంటలు జంటలుగా ఆకాశాన ఎగురుతూ పోతున్నాయి. అప్పుడే తెల్లతెల్లవారుతుంది సూర్యుడు అవనితల్లినుదట సింధూర తిలకమై మెరుస్తున్నట్టు కనబడుతున్నాడు. లేగ దూడలు అంబా అంటూ పరుగులు తీస్తూ ఆడుతున్నాయి ఆ దృశ్యం చూసి మా అక్కయ్య నేను ఎంతో మురిసిపోయాము. అంత మంచి ప్రకృతిని వదిలి వెళ్లాలంటే ఎంతో బాధగా ఉంది. కానీ సెలవులు ముగిసిపోయాయి. 

కామెంట్‌లు