ఇద్దరం తలపడదాం...నేను గెలిస్తే నీ స్కూలుని నువ్వు మూసెయ్యాలి. నువ్వు గెలిస్తే నేను నేర్పడం మానేస్తాను. ఈ సవాలుకి సిద్ధమేనా అని ఆవేశంతో అడిగాడు కుంగ్ఫూలో ప్రఖ్యాతి పొందిన గురువైన వాంగ్ జాక్ మాన్.
అమెరికాలో అప్పుడప్పుడే కొత్తగా మార్షల్ ఆర్టుని నేర్పించే బ్రూస్లీ ఎలాంటి జంకూబొంకూ లేకుండా జాక్ మన్ విసిరిన సవాలుకి సై అన్నాడు.
పోరుకు బరిలోకి దిగిన కొద్ది క్షణాలకే ఓటమిపాలయ్యాడు జాక్ మాన్.
ఈ విషయం అటు అమెరికాలోనూ ఇటు చైనాలోనూ అందరి నోటా నానింది. ఎవరి నోట విన్నా బ్రూస్లీ ప్రతిభ గురించే మాటలు.
"ఏ ధైర్యంతో వాంగ్ తో తలపడటానికి ఒప్పుకున్నారు?" అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బ్రూస్లీ ఇచ్చిన జవాబు...
"నేను తత్వాన్ని ఓ పాఠంలా చదివాను. అవకాశాలు తమంతట తాముగా రావు. మనమే కల్పించుకోవాలి అని తెలుసు.
అందుకే గెలుపు, ఓటమి గురించి ఆందోళన చెందకుండా నేను నా కళపై నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించుకున్నాను" అని!
25వ ఏట వరకు ఓ సాధారణ టీవీ నటుడిగా ఉండిన బ్రూస్లీ ఈ ఘటన తర్వాత ప్రపంచ ఖ్యాతి పొందాడు.
అయితే బ్రూస్లీ - వాంగ్ జాక్ మాన్ మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన విషయం ఇప్పటికీ వివాదాస్పదమే. 1964లో ఓ చైనాటౌన్లో ప్రైవేట్‌గా జరిగిన పోరు. అప్పటికి వీరిద్దరూ 20 ఏళ్ల ప్రాయంలోనే ఉన్నారు.
బ్రూస్ లీ భార్య లిండా లీ కాడ్‌వెల్ ప్రకారం, "శ్వేతజాతీయులకు చైనీస్ మార్షల్ ఆర్ట్సుని బ్రూస్లీ బోధించడంవల్ల శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనీస్ మార్షల్ ఆర్టుకు చెందిన వారు ఆయనను ఇష్టపడలేదు. శ్వేతజాతీయులకు బోధించే హక్కు కోసం బ్రూస్లీ పోరాడుతున్నాడని వాంగ్ వాదన. ఎందుకంటే అతని విద్యార్థులలో చాలా మంది చైనీస్ వారే..."
1940 నవంబరులో జన్మించిన బ్రూస్ లీ 1973 జూలైలో మరణించాడు. ఇతను
హాంకాంగ్, అమెరికన్ మార్షల్ ఆర్టిస్ట్, నటుడు, దర్శకుడు, తత్వవేత్తగా కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. ఆధునిక మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)కి మార్గం సుగమం చేసిన ఘనత పొందిన బ్రూస్ లీని అత్యంత ప్రభావవంతమైన మార్షల్ ఆర్టిస్ట్‌గానూ ఇరవయ్యో శతాబ్దపు పాప్ సంస్కృతికి చిహ్నంగానూ పరిగణిస్తారు. తూర్పు - పశ్చిమాల మధ్య అంతరాన్ని తగ్గించాడు బ్రూస్ లీ. మరోవైపు వాంగ్ జాక్ మాన్ 1941లో జన్మించాడు. 2018 డిసెంబరులో మరణించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి