ఓ అందమైన చిన్నారి- జగదీశ్ యామిజాల
ఓ అందమైన చిన్నారి.
ముద్దులొలికే చిన్నారి. 
ఆమె దగ్గర రెండు ఆపిల్ పళ్ళున్నాయి.

కాస్సేపటికి ఆ పిల్ల తల్లి అక్కడికి వచ్చింది. 

"ఇదిగో నీ దగ్గర రెండున్నాయి కదా....
ఒకటి నాకివ్వు" అని అడిగింది ఆ తల్లి.

అమ్మను ఓ క్షణం చూసిన  చిన్నారి ఓ పండుని కొరికింది. ఆ వెంటనే రెండో పండునీ కొరికింది. 

అప్పటి వరకూ ఆ తల్లి ముఖాన ఉన్న నవ్వు చెదరిపోయింది. 

తనకొకటి ఇవ్వనందుకు బాధపడిందా తల్లి. ఒకటిమ్మంటే ఇలా చేసేదేమిటాని అనుకుంది. అడిగి లేదనిపించుకున్నానుగా అనుకుంది. 
ఎవరైనా ఏదన్నా అడిగితే ఇచ్చే మంచి పద్ధతిని నేర్పాలనుకుంది.
అంతేతప్ప ఇలా ఉండకుండా చూడాలి. 
ఇలా ఇలా ఆ ఒక్క క్షణంలో అనుకున్న ఆ తల్లి
తన భావాన్ని ముఖాన చూపకుండా ఉండటానికి ప్రయత్నించింది. 

ఇంతలో ఆ చిన్నారి ఆ అమ్మకో పండిచ్చి "ఇది తీసుకో....తియ్యగా ఉంది. నీకు తియ్యగా ఉన్న పండివ్వాలని రెండూ రుచి కొరికి రుచి చూసానమ్మా" అని చెప్పిందా చిన్నారి.

ఇది చిన్న కథే కావచ్చు. 
కానీ ఇది చెప్పే విషయం...

మీరెవరైనా కావచ్చు. 
మీ అనుభవం ఎంతైనా కావచ్చు.
తెలివితేటలు అపారంగా ఉండొచ్చు.
కానీ ఒకరి గురించి ఓ అభిప్రాయానికి రావడానికి ముందర కాస్తంత ఆలోచించాలి. 
అంతేతప్ప చూసీచూడటంతోనే 
వారి తీరింతే అనే అభిప్రాయానికి రాకూడదు.


కామెంట్‌లు