మనం మారాలి!; - - యామిజాల జగదీశ్
 "ఉసిరికాయ ఎంత?" అడిగిందామె.
"పావు కిలో పాతిక" అంది ఉసిరికాయలమ్ముతున్న వృద్ధురాలు.
"సరే. పావు ఇరవైకిస్తే అర కిలో తీసుకుంటా" అంటూ రెండు ఇరవై రూపాయల నోట్లను చాచిందామె.
"అలాగేనమ్మా...నువ్వు అడిగిన ధరకే ఇస్తాను... తీసుకో...ఉదయం నుంచి ఇప్పటివరకూ వ్యాపారమే కాలేదు. నువ్వే బోణీ అమ్మా...." అంటూ వృద్ధురాలు. "ఆ దేవుడు నిన్ను చల్లగా చూడనీ" అంది.
తను అడిగిన ధరకు దొరికాయన్న సంతోషంతో ఆమె ఉసిరికాయలు తీసుకుంది.
అనంతరం ఓ విలాసవంతమైన కారులో తన స్నేహితురాలితో కలిసి ఓ స్టార్ హోటలుకి వెళ్ళిందామె.
ఇద్దరూ కలిసి హోటల్లో మాట్లాడుకుంటూ తమక్కావలసింది ఆర్డరిచ్చి తిన్నారు.
తిన్నది తక్కువే!
బిల్లు మాత్రం ఎక్కువ!!
బిల్లు అమౌంట్ తొమ్మిది వందల రూపాయలు!!
ఆమె వెయ్యి రూపాయలు ఇచ్చింది. పైపెచ్చు మిగిలిన వంద రూపాయలు ఉంచుకోమంది. 
హోటల్ వారికి ఇలాంటివి చాలా మామూలు విషయం.
కానీ, పావు కిలో పాతిక రూపాయలని ఉసిరికాయలు అమ్మిన వృద్ధురాలితో  ఇరవైకిస్తావా పదికిస్తావా అని బేరం చేయడమే కాకుండా వాదనకు దిగటం బరువైన విషయం కదూ?
ఇక్కడ చూడవలసింది....
మన సాయం అవసరమన్న పేదల దగ్గరేమో ఏదైనా కొంటున్నప్పుడు మన బలాన్ని చూపిస్తాం. మాటలూ రువ్వుతాం.
ధనవంతులకో, 
అవసరాలు లేని వారి దగ్గరేమో
మనం మన హృదయం చాలా విశాలమైనట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం.
మొదట మనం మారుదాం!
సమాజంలో మంచి మార్పుని తీసుకొద్దాం!!

కామెంట్‌లు