కర్మఫలం; -: సి.హెచ్.ప్రతాప్
 సోమాపురం లో నివసించే రంగడి తండ్రి అకస్మాతుగా చనిపోయాడు.రోజంతా ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ, ఇంటి పనులు, పొలం పనులు చెసుకునే ఆయన హఠాత్తుగా మరణించడం ఆ కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచివేసింది. గత జన్మ పాపాల వలనే మానవులు ఇలా అర్ధాంతరంగా మరణిస్తారని, దశదిన కర్మలు ఘనంగా,శాస్త్రోక్తంగా చేయిస్తే ఆ ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ఇరుగు పొరుగు వ్యాఖ్యానించడం రంగడు విన్నాడు. తండ్రి పార్ధీవ దేహానికి అగ్ని సంస్కారం పూర్తయ్యాక, ఆ ఊరిలో వుండే ఒక సాధువు వద్దకు వెళ్ళాడు. ఆయన కాళ్ళపై పడి తాను విన్న విషయం చెప్పి, ఆయన శాస్త్ర జ్ఞానం అంతా ఉపయోగించి తన తండ్రికి సద్గతులు వచ్చేలా చూడమని ప్రార్ధించాడు.
అంతా విన్న ఆ సాధువు తల పంకించి కొంచెం ఆలోచించి, తర్వాత రంగడితో రెండు చిన్న మట్టి కుండలు, కొన్ని కంకర రాళ్ళు, కొంత వెన్న తీసుకురమ్మని పురమాయించాడు.
క్షణాలలో రంగడు వాటిని తీసుకువచ్చాడు. సాధువు ఆదేశం ప్రకారం ఒక కుండలో వెన్న, ఇంకొకదానిలో కంకర రాళ్ళు వేసి , గుడ్డతో వాసెన కట్టాడు.తర్వాత వాటిని సాధువు చెప్పినట్లు దగ్గరలో వున్న ఒక సరస్సులో ముంచేసాడు. ఆ రెండు కుండలూ నెమ్మదిగా సరస్సు అడుగుకు దిగిపోయాయి.
తర్వాత సాధువు కొన్ని మంత్రాలు చదివి, ఒక కర్రను తెచ్చి రెండు కుండలను బద్దలు కొట్టమన్నాడు. రంగడు ఇదేదో కొత్త కార్యంలా వుందని, దానిని ఎంత శ్రద్ధతో చేస్తే తన తండ్రికి అంత త్వరగా స్వర్గ ప్రాప్తి కలుగుతుందని కర్రతో ఆ రెండు కుండలను బద్దలు కొట్టాడు. 
వెంటనే ఒక కుండలో వున్న వెన్న నెమ్మదిగా పైకి లేచి సరస్సు నీళ్ళపై తేలియాడసాగింది కాగా రెండవ కుండలో వున్న రాళ్ళు నీటి అడుగునే వుండిపోయాయి.
అప్పుడు ఆ సాధువు రంగడితో, ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుడిని గట్టిగా ప్రార్ధించు. వెన్న కిందకి, రాళ్లు పైకి తేలితే మీ తండ్రి గారి పుణ్యం ఎక్కువవడం వలన ఆయనకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని అన్నారు.
ఆ మాటలకు రంగడికి కోపం వచ్చింది. అదేమిటి స్వామి? పదార్థం యొక్క స్వభావం, ప్రాకృతిక నియమానుసారం వెన్న నీటిపై తేలడం, రాళ్ళు బరువు వలన కిందనే ఉండిపోవడం  సహజం. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా  ఎంత ప్రార్ధన చేసిన వెన్న కిందకు దిగడం ఎలా సాధ్యం. దీనికి మా తండ్రి గారి పుణ్యానికి సంబంధం ఏమిటి ? అని సాధువును ప్రశ్నించాడు. అందుకు ఆ సాధువు ఎంతో శాంతంగా " నాయనా, ప్రకృతి ధర్మం గురించి ఇంత బాగా అర్ధం చేసుకున్న వాడివి అదే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి మెలిగే కర్మ ఫలం గురించి ఎలా మర్చిపోయావు ?. ప్రాకృతిక స్వభావం అనుసరించి వెన్న ఎలా పైకి వచ్చి నీటిపైన తేలిందో, అట్లే మీ తండ్రిగారు కూదా తన కర్మ ఫలం బట్టే స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళడం జరుగుతుంది.  పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనం చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలాగంటే ,నోములు నోచి సంతానాన్ని పొందితే, ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు!మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే, ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది! కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.కాబట్టి ఫలితం ఆశించక మీ నాన్నగారి దశదిన కర్మలను చిత్తశుద్ధిగా పూర్తి చెయ్యు. ఆపైన ఆ భగవంతుదే అన్నీ చూసుకుంటాడు.
 సాధువు చెప్పిన ఈ మాటలకు రంగడిలో జ్ఞానోదయ మయ్యింది. తన అజ్ఞానానికి మన్నించమని వేడుకుంటూ ఇంటికి వెళ్ళి తన తండ్రికి చేయవలసిన విధులు అన్నింటినీ చక్కగా చేసాడు.
సి హెచ్ ప్రతాప్ 


MOBILE no : 95508 51075

కామెంట్‌లు