భగవద్గీత ప్రాశస్త్యం; - సి.హెచ్.ప్రతాప్
 సుమారు 5200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. అసలు భగవ్ద్గీత ఒక సంపూర్ణ వ్యక్తివ వికాస గ్రంధం అని, దీనిని అన్ని మతాల వారు చదివి ఎంతో ఉపయోగం పొందవచ్చునని కుదా ఆధ్యాత్మిక వాదులు భావిస్తున్నారు.  భగవద్గీతను తరచుగా “గీత” అని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. మానవుల హృదయాలలో జన్మ జన్మల నుండి గాఢంగా పేరుకొని పోయి వున్న గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత శ్రీ కృష్ణుని వాక్కు నుండి ఉదయించింది. కురుక్షేత్రం యుద్ధం ఆరంభంలో  రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని “నా కర్తవ్యమేమి?” అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు.
భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. వాస్తవానికి భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం.
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’- క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే బోధ ప్రారంభించాడు.
గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాల చర్చను లేవనెత్తలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నిటిలో ఆరితేరిన సవ్యసాచి అర్జునుడు. మట్టిపట్టిన మాణిక్యాన్ని దులిపినట్టుగా, అర్జునుడిని ఆవహించిన మాయామోహాలను తన బోధతో తొలగించాడు
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు