కలెక్టరెందుకు మేకప్ చేసుకోవడం లేదు?;- - యామిజాల జగదీశ్
 కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయామోయ్. ఆమె ఓరోజు కాలేజీ విద్యార్థులను కలిసి ముచ్చటించారు.
కలెక్టర్ చేతికున్న రిస్ట్ వాచీ తప్ప ప్రత్యేకించి ఎటువంటి నగానట్రా ధరించలేదు. ముఖానికి ఏ మేకప్పూ లేదు. 
అక్కడున్న విద్యార్థులలో పలువురిని ఆశ్చర్యపరచిన విషయం...ఆమె ముఖానికి పౌడర్ కూడా పూసుకోకపోవడం.
మొదట ఒకటి రెండు నిముషాలు మాత్రమే ఆమె ఇంగ్లీషులో మాట్లాడారు. ఆ తర్వాత తను నేర్చుకున్న మళయాలంలోనే మాటలు కొనసాగించారు. విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఎంతో మృదువుగా జవాబులిచ్చారు.
"మీ పేరు...?"
కలెక్టర్ : నా పేరు రాణి. సోయామోయ్ అనేది నా ఇంటి పేరు. మాది జార్ఖండ్ రాష్ట్రం.
"ఇంకేవైనా అడగలనుకుంటున్నారా...." అని ఆమె అడగ్గానే బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి లేచి నిల్చుంది.
"అడుగమ్మా" 
"మేడమ...మీరెందుకు మేకప్ చేసుకోలేదు" అని ఆ విద్యార్థి ప్రశ్న?
కలెక్టర్ ముఖకవళికలు మారాయి. చిరు చెమట చుక్కలు కనిపించాయి ముఖంమీద. 
ఆమె ముఖాన నవ్వు మాయమైంది. ప్రేక్షకులు మౌనంగా ఉన్నారు.
ఆమె తన ముందున్న వాటర్ బాటిల్ మూత తీసి కాసిన్ని నీళ్ళు తాగారు.
అనంతరం ఆమె ఆ విద్యార్థి వంక చూసి కూర్చోమని సైగ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు.
ఈ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఒకటి రెండు మాటల్లో జవాబు చెప్పలేను. నా జీవితంతో ముడిపడిన విషయాన్ని చెప్పాలి. నా కథను వినడానికి మీరు ఓ పది నిముషాలు టైమ్ కేటాయిస్తారనుకుంటాను.
మాది జార్ఖండ్ రాష్ట్రం. ఓ గిరిజన ప్రాంతంలో పుట్టానంటూ ప్రేక్షకులవైపు చూశారు.
మైకా గనులతో ప్రసిద్ధికెక్కిన కొడెర్మా జిల్లాలోని గిరిజనులుండే ప్రాంతంలో ఓ పూరిపాకలో పుట్టాను. మా అమ్మా నాన్నా సొరంగ కార్మికులు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఓ సోదరి ఉన్నారు. వర్షం పడితే ఇల్లంతా తడిసి ముద్దయ్యేది. అటువంటి ఇల్లు మాది. మరే పనీ దొరకకపోవడంతో మా అమ్మానాన్నా సొరంగంలో కూలీలుగా పని చేశారు. ఆ పని కూడా చాలా క్లిష్టమైనది. 
నాకు నాలుగేళ్ళున్నప్పుడు మా అమ్మా నాన్నా ఇద్దరు అన్నయ్యలు అనారోగ్యంతో మంచానపడ్డారు. తవ్వకాలలో ఉన్న మైకా దుమ్ముని శ్వాసించడంతో తమకు జబ్బు సోకినట్టు తెలియని స్థితి వారిది. నా అయిదో ఏట ఇద్దరు సోదరులూ అనారోగ్యంతో మరణించారు. తినడానికి సరైన తిండికూడా ఉండేది కాదు. ఒక్కొక్క రోజు మంచినీరే ఆహారం.  లేదా రెండేసి రొట్టె ముక్కలు. మా పల్లెలో వైద్యుడి దగ్గరకు కానీ స్కూలుకి గానీ వెళ్ళిన వారంటూ లేరు. కారణం, స్కూలు గానీ ఆస్పత్రిగానీ కరెంటు కానీ లేని కుగ్రామం మాది. కనీసపాటి వసతులు లేని గ్రామంలో పుట్టి పెరిగాను.
ఓరోజు నేను ఆకలితో ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఇనుప తలుపులతో మూసి ఉన్న ఓ సొరంగంలోకి తీసుకుపోయారు. అది ఆ ప్రాంతంలో ఓ ప్రముఖ మైకా సొరంగం. పురాతనమైంది. కింద ఉన్న చిన్న చిన్న గుహల గుండా వంగి నడుస్తూ మైకాను సేకరించడం నా పని. నాలాగా పదేళ్ళలోపు పిల్లలం మాత్రమే ఆ పని చేసాం. ఆరోజు మొదటిసారిగా నేను రొట్టె ముక్క తిని కడుపు నింపుకున్నా. విష కాలుష్యాన్ని పీలుస్తూ పని చేయవలసిన దుస్థితి. అప్పుడప్పుడు కొందరు ఈ కాలుష్య కోరల్లో పడి చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. కొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.
రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తేనే ఓ రొట్టెముక్క దొరికేది. ఆకలితోనూ పస్తులతోనూ ఆరోగ్యమూ దెబ్బతినేది. ఓ ఏడాది తర్వాత నా సోదరి నాతోపాటు పనిలోకొచ్చింది. 
రోజులు భారంగానే కొనసాగాయి. ఓరోజు జ్వరంతో పనికి వెళ్ళలేని స్థితి. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. సొరంగంలో పని చేస్తున్న కార్మికుల కళ్ళెదుటే సొరంగం కుప్పకూలడంతో వందల మంది అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో మా అమ్మానాన్నాసోదరికూడా ఉన్నారు. అంతటా ఏడుపులు. పెడబొబ్బలు. 
నాకు ఆరేళ్ళు. చివరికి ఓ ప్రభుత్వ కేంద్రానికొచ్చి ఆశ్రయం పొందాను. అక్కడి నుంచే నా చదువు మొదలైంది. 
మా గ్రామం నుంచి రాయడం చదవడం తెలిసిన మొదటి మహిళను నేనే. ఇదిగో ఇప్పుడు మీ ముందు కలెక్టరుగా నిల్చుని మాట్లాడుతున్నా. అయితే మీకో అనుమానం రావచ్చు. దీనికీ, మేకప్పు వేసుకోకపోవడానికి ఏమిటి సంబంధం అని అడగొచ్చు. 
ఆరోజుల్లో సొరంగంలో వంగి వంగి పని చేస్తూ నేను సేకరించిన మైకాను అలంకార సామగ్రి తయారీలో ఉపయోగిస్తుంటారన్న విషయాన్ని అప్పుడే తెలుసుకున్నాను. మైకా అనేది ఫ్లోరసెంట్ సిలికేట్ ధాతువులో మొదటి రకం. పలు భారీ సంస్థలు సమర్పించే మినరల్ మేకప్ సామగ్రిలో ఉపయోగించే వాటికోసం
ఇరవై వేల మంది పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేయడంవల్లే మీ చర్మసౌందర్యం మెరుగులుదిద్దుకుంటోంది. గులాబీ మృదుత్వం మీ ఛెక్కిళ్ళకొస్తోంది. వాటి వెనుక ఉన్న పిల్లల శ్రమను ఒక్కసారి ఆలోచించండి. మనం అందాన్ని ఆరాధిస్తున్నాం. కానీ ఆ శ్రమజీవుల గురించి రవ్వంత కూడా ఆలోచించం. ఇప్పుడు మీరు చెప్పండి....నేనెలా మూఖాన్నెలా సింగారించగలను ? పస్తులతో జబ్బులతో మరణించిన నా సోదరులు గుర్తుకొస్తుంటే కడుపారా ఎలా తినగలను? ఎప్పుడూ చిరిగిన బట్టలు ధరించే ఆ అమ్మ గుర్తుకొస్తుంటే నేనెలా ఖరీదైన చీరలు కట్టుకోగలను? .....ఇలా చెప్తూ చెప్తూ మరేదీ మాట్లాడలేక ఆమె చిర్నవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రేక్షకులందరూ లేచి నిల్చున్నారు. వారి ముఖాలలో ఉన్న అలంకరణ కన్నీటితో కరిగిపోయింది. ఫేస్ పౌడర్, క్రీమ్, లిప్ స్టిక్ లతో మెరిసే స్త్రీలను చూసి ముఖం చిట్లించే వారిని తప్పుపట్టకండి. విలువైన ఖరీదైన మైకా ఇప్పటికీ జార్ఖండ్ నుంచే లభిస్తోంది. వేలాది మంది పిల్లలు స్కూళళకు వెళ్ళి చదువుకోకుండా అక్కడి గనులలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అనుకోని ప్రమాదాలకు గురై ఇంకొందరు జబ్బులపాలై మరణిస్తున్నారు. 
ఓ మళయాల పత్రికలో వచ్చిన ఈ విషయాన్ని ఓ తమిళ పత్రిక ప్రచురించగా అది చదివి రాసిన మాటలివి.

కామెంట్‌లు