సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -40
కూర్మ కిషోర న్యాయము
    *******
కూర్మము అంటే తాబేలు. కిశోరము అంటే పిల్ల లేదా శిశువు.
తాబేలు తన గుడ్లను ఒక చోట ఇసుకలో కప్పి పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక వాటిని  పొదగడం కానీ సంరక్షించడం కానీ చేయదు.వాటి గురించి మనసులో ఉంటుంది కానీ, చాలా కాలం వరకు  ఆలోచించదు.
ఎప్పుడైతే హఠాత్తుగా తన గుడ్ల సంగతి మనసులో మెదిలి గుర్తుకు తెచ్చుకుంటుందో,ఆ జ్ఞాపకం తెచ్చుకున్న మరుక్షణమే అక్కడ గుడ్లు పగిలి వాటి నుండి పిల్లలు వస్తాయి. ఇలా జరిగే సంఘటనను కూర్మ కిషోర న్యాయము అంటారు.
ఒక రకంగా చెప్పాలంటే దీనిని సిక్త్ సెన్స్ లేదా అంతర్ దృష్టి అంటారు.అదొక అద్భుతమైన శక్తి.మనం చేసే పని, నిర్ణయాలు భావోద్వేగాలు ఇవన్నీ అంతర్ దృష్టిని ప్రభావితం చేస్తాయి.
తను పెట్టిన గుడ్లు పక్వదశకు రావడం తాబేలుకు మానసికంగా తెలుస్తుంది.కాబట్టి గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ మరుక్షణమే అవి పిల్లలై బయటికి రావడం జరుగుతుంది.
ఇలాంటివే కొన్ని సంఘటనలు మన నిత్య జీవితంలో కూడా చోటు చేసుకోవడం చూస్తుంటాం ఇవి శాస్త్రానికి అందవు. కజరిగిన ప్రతి సారీ వింతగా విచిత్రంగా అనిపిస్తుంది . 
మనకు బాగా ఇష్టమైన వ్యక్తులకు ఏదైనా సంభవించినప్పుడు అదే సమయంలో మనకు ఆవ్యక్తి స్ఫురణకు రావడం. దగ్గర లేకున్నా శిష్యులకు గురువు గుర్తొచ్చి తమ కర్తవ్యాన్ని ఆచరించడం లాంటివి ఈ కోవకు చెందినవే.
ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు కదా. తమ సంతానానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కన్నపేగు కదులుతుంది.ఉలిక్కి పడుతుంది. విషయం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సమయంలో వారికి నిజంగా అలాంటి సంఘటన ఎదురైంది అని చెప్పడం వింటుంటాం. ఇది శాస్త్రానికి అందక పోవచ్చు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈ కూర్మ కిషోర న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అత్యంత ఆత్మీయులకు సంబంధించి  కూడా ఇలాంటివి అనుభవం లోకి వస్తూ ఉండటం గమనార్హం.
ఇలాంటి అంతర్ దృష్టి లేదా సిక్త్ సెన్స్ గురించి ప్రముఖ మెజీషియన్ బి.వి.పట్టాభిరాం గారి వ్యాసాలు ధారావాహికంగా  45 సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రభ  వార పత్రికలో ప్రచురింపబడ్డాయి.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు  పెద్ద వాళ్ళు ఈ కూర్మ కిషోర న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు