సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-35
కాశ కుశావలంబన న్యాయము
******
కాశ లేదా కాశః అంటే చాపలు అల్లుటకు లేదా ఇంటికప్పు వేయుటకు ఉపయోగించే ఒక విధమైన గడ్డి దీనినే రెల్లు గడ్డి అంటారు.కాశ కుశము అంటే రెల్లు గడ్డి పుడక లేదా పోచ.ఆవలంబన అంటే ఆధారము లేదా ఆశ్రయము.
నదిలోనో,ఏరులోనో,కాలువలోనో ప్రవాహంలో పడి కొట్టుకుపోయేటప్పుడు  చేతికందిన గడ్డిపోచను పట్టుకొని ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రయత్నం చేయడం.
ప్రాణ భీతితో ఉన్నప్పుడు అది తనను రక్షిస్తుందా లేదా విచక్షణ మనసుకు ఉండదు. అంటే ఆపదలో ఉన్నప్పుడు బయటపడాలనే తపనే తప్ప తాను ఆశ్రయించిన దాని వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే ఆలోచన ఉండదు.
కానీ ఆ చిన్న గడ్డి పోచే మానసికంగా ఓ ధైర్యాన్ని , తనను తాను రక్షించుకోవడానికి పోరాడగలను అనే నమ్మకాన్ని ఇస్తుంది. అలాంటి సందర్భంలో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. దీనినే "కుశ కాశావలంబన న్యాయము" అని కూడా అంటారు.
ఆపద కానీ ఏదైనా పెద్ద కష్టం కానీ వచ్చినప్పుడు ఒక చిన్న ఆశతో వాటి నుండి బయట పడేందుకు  చేసే ప్రయత్నమే ఇది.
కుటుంబాల్లో ఎన్నో రకాల విషాద సంఘటనలు జరుగుతుంటాయి.ఒకో సారి బతకలేని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనసు చూపే చిన్న ఆశ అనే దీపమే రెల్లు గడ్డి పోచ అని అర్థం.అది భవిష్యత్తులో బతికేందుకు ఆలంబనగా నిలుస్తుంది. 
దీనినే ఏ దారి దొరకని వారికి  ఆ దేవుడే దారి  చూపించాడు అనడం వింటుంటాం.ఇలాంటి సందర్భంలో కూడా ఈ కాశ కుశావలంబన న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు