అయిదు లాభాలు!; -- యామిజాల జగదీశ్
 అది ఒక తోపుడుబండి. ఒకతను కాయగూరలు అమ్ముతున్న బండీ అది. అతని అరుపులు నన్నాకట్టుకున్నాయి. 
"అయ్యా అమ్మా నా దగ్గర కూరలు కొన్నవారికి అయిదు లాభాలు" అంటూ అతను రోడ్డు పక్కన బండీ ఆపి అరుస్తున్నాడు. అయిదు లాభాలేంటి చెప్మా అనుకుని అతనిని అడిగాను. అందుకతను చెప్పిన మాటలివి...
1. మీరు నా దగ్గర కొనే కూరలకు జి.ఎస్.టి. ఇవ్వక్కర్లేదు. వందకు అయిదు రూపాయలు లాభం. ఇది మొదటి మేలు.
2. సార్. మీరు కొనే వాటిని తీసుకుపోవడానికి కవర్ ఉచితం. మీరు సూపర్ మార్కెట్లో కొంటే ఈ కవరుకి అయిదో పదో ఇవ్వాలి. ఇది నా దగ్గర రెండో మేలు.
3. సూపర్ మార్కెట్లో వారడిగిన ధరకు మీరు కొనాల్సిందే. నా దగ్గర మీరు బేరం చేయొచ్చు. అయిదో పదో తగ్గిస్తాం. ఎందుకంటే ఇదే మా జీవనాధారం. ఇది మూడో మేలు. 
4. ఈ కాయగూరలు ఇక్కడికి దగ్గర్లో ఉన్న పల్లెలో పురుగుల మందు చల్లకుండా సహజసిద్ధంగా సాగుచేసినవి. వీటిని తింటే ఆరోగ్యానికి ఏ నష్టమూ లేదు. ఇది నాలుగో మేలు.
అతను చెప్పిన మాటలన్నీ వాస్తవం. దాంతో అతని దగ్గర కొన్ని కూరలు కొన్నాను. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇక చివరి మేలేమిటో అని అడిగాను.
5. నా భార్య జబ్బు మనిషి. మందుల ఖర్చులకు ఎవరి దగ్గరా చెయ్యి చాచడం లేదు. బేరం చేయకుండా నా దగ్గర కాయగూరలు కొనేవారు ఇచ్చే డబ్బులో కొంత భాగం ఆమె మందులకు ఖర్చు పెడతాను. ఆ వాటా ఓ విధంగా దానంలాటిదే కదయ్యా. ఈ క్రమంలో మీకు ఆ దేవుడి నుంచి లభించే అనుగ్రహం అయిదో లాభమండి అన్నాడతను.
అతనిన్ని మాటలూ నవ్వుతూ చెప్తుంటే మనసులోని ఆనందమంతా అతని ముఖాన కనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడి నుంచి బరువైన హృదయంతో ఇవతలకు వచ్చాను.
ఇటువంటి కష్టాలు కన్నీళ్ళు రోడ్డు పక్కన అమ్మేవారిలో అధికశాతం మందికి ఉండొచ్చేమో.... కనుక వారి దగ్గర కొనేటప్పుడు బేరం చేయకపోవడమే మంచిదేమో!!

కామెంట్‌లు