పూలమాలల పరిమళాల రాగాలొక వైపు
కన్నీటి అప్పగింతల గీతాలు మరోవైపు..
. ఇంతలో పదవీ విరమణకు సమయమైంది...
గట్టిగా ఊపిరిని బిగబట్టి వదిలినంత హాయిగా ఉంది ఇప్పుడు...
రేపు మాపుల లెక్కలు చూడడానికి నేనున్న స్థానంలో మరొకరిని కాలం నిర్ణయించింది...
అదప్పుడు తోచనే లేదు కానీ విలువ తెలుసుకున్నాక ఇప్పుడు విపరీతమైన ఆందోళన కలిగింది....
ఇక వెలుగు ఎంత పరచినా
సరిపోదు దారిని గనుగొనే కళ్ళు రెండు గుడ్డివయ్యాయి...
సంతోషాలను వాకిట్లో బోర్లించి
చప్పట్ల శబ్దం చేశాను...
నాలుగు పాదాలైనా వచ్చి చేరుతాయని...
క్షణం తీరికలేదు
నచ్చిన తీరుగా బ్రతుకుదామంటే,
ఖర్చుపెట్టిన కాలాన్ని
వెనుతిరిగి ఒక్కసారి చూస్తే....
పశ్చాత్తాపం కలిగింది...
అందుకే బ్రతిమాలైనా మరో జన్మను అరువుగా అందుకొని
సంతృప్తి పొందాలనిపిస్తుంది...
ఇంతలో తల్లి ఒడిలో మరో ప్రాణం పురుడోసుకుంది..
మరో కురుక్షేత్ర యుద్ధం సన్నద్ధమైంది...
మరలా తలెత్తబోనున్న
ప్రశ్నలు అవే...
సమాధానాలు అవే...
దారులు అవే...
గమ్యాలు అవే
సంఘర్షణ అదే
జీవితమూ అదే...
"కేవలం పాత్రలు,"
నిలుపుకున్న
"జ్ఞాపకాలు మాత్రమే వేరు వేరు ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి