రంగమార్తాండ....;- ప్రమోద్ ఆవంచ- --7013272452

 రాఘవ రావు.....ఒక రంగస్థల నటుడు.భార్యాపిల్లలను పట్టించుకోకుండా వందల ప్రదర్శనలు ఇచ్చి,పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా సంపాదిస్తాడు.తనకు రంగమార్తాండ అనే బిరుదుతో పాటు, గండపెండే రం తొడిగిన సభలో, రిటైర్మెంట్ ని ప్రకటిస్తాడు.ఇక ఇప్పటి నుంచి నా కుటుంబం, మిత్రుడు చక్రపాణితో, ఆనందంగా బతకాలనీ నిర్ణయించుకుంటాడు.చక్రపాణి తోటి కళాకారుడు.రాఘవరావుకు అత్యంత సన్నిహితుడు.
సన్మాన సభ అయిపోయాక ఇంటికి వచ్చి తన యావదాస్తిని కొడుకు, బిడ్డ లకు పేరు మీద రాసి ఆ పత్రాలను వాళ్ళకప్పగిస్తాడు.తనకంటూ చిల్లిగవ్వ కూడా ఉంచుకోడు.అదేంటండీ మనకు ఏమీ వద్దా అన్న భార్య తో,మన పిల్లలే కదా...అనీ సర్ది చెపుతాడు.ఇక ఆ తరువాత రొటీన్ తెలుగు సినిమాల్లోగానే తల్లిదండ్రుల ప్రవర్తన నచ్చక, ఇటు కోడలు, ఆమెను కంట్రోల్ చేయలేనీ కొడుకు ఒకవైపు,అటు బిడ్డ తండ్రి మీద అపనిందలు వేయడం... ఇలాంటి సన్నివేశాలు  మనం దాసరి నారాయణరావు గారి సినిమాల్లో ఎన్నో చూసాం.
              కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడమే నన్ను నిరాశ పరిచింది.ఆ టైటిల్ చూసి,నేనేమనుకున్నానంటే,ఆదరణ తగ్గుతున్న రంగస్థల నాటకాలను,ఆ కళాకారుల బాధలను మనకు చూపిస్తారేమోననీ... ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సురభి నాటక సమాజం పరిస్థితి నేడు దయనీయంగా మారింది.అందులో పని చేసిన కళాకారులు దిక్కులేక తలా ఓ దిక్కున వెళ్ళిపోయారు.అలాంటి నాటక సమాజాలు రెండు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి.వాళ్ళ గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న దాఖలాలు లేవు.వేరే వృత్తి చేయలేక, నాటకాలు చూసే, జనాలు లేక తినడానికి కూడా తిండి లేని అనేక మంది కళాకారులు తిప్పలు పడుతుండడం మనం నిత్యం వార్తల్లో చదువుతే ఉన్నాం.
              దర్శకుడు కృష్ణవంశీ సినిమా అంటే మనందరం సినిమాలో మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తాడని పూర్తి నమ్మకం.అదే నమ్మకంతో నేను సినిమాకువెళ్ళాను .ఇందులో కూడా సందేశం ఇచ్చాడనుకోండీ,తల్లిదండ్రులను, బాగా చూసుకోవాలని.కానీ ఆయనకు ప్రతిభకు తగ్గట్టుగా లేనట్లుగా ఈ సినిమా లేదని అనిపించింది.ఆయనను కూడా తప్పు పట్టడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు.ఎందుకంటే ఈ కథ ఒక మరాఠీ సినిమా రీమేక్.అదే ఆయన తీసారు.ఆయననే గొప్ప రైటర్, కావాలనుకుంటే ఆయననే ఒక మంచి కథ రాసుకుని సినిమా తీయవచ్చు.మరి రీమేక్ తీయాల్సిన అవసరం ఏమోచ్చిందో నాకు అర్ధం కావట్లేదు.
              కానీ రాఘవ రావు మిత్రుడు చక్రపాణి పాత్ర పోషించిన బ్రహ్మానందం గారిని,తన రొటీన్ కామెడీ నుంచి ఒక సీరియస్ పాత్ర ఇవ్వడం దర్శకుడి గట్స్ కి మనం హ్యాట్సాఫ్ చెప్పాలి.ఏ మాటకు ఆ మాట చెప్పాలి,బ్రహ్మానందం గారు చాలా అద్భుతంగా నటించారు.తన భార్య చనిపోయినాక, తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు చాలా రోజుల తర్వాత చూడడానికి వచ్చినప్పుడు, తలుపు తెరిచి, రాఘవ రావును, చూసి,ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వస్తావా అంటూ,చెంప దెబ్బ కొట్టే సీన్లో బ్రహ్మానందం గారి నటన...ఇంకా హైలెట్ సీన్ ఏంటంటే, హాస్పిటల్ లో చక్రి దగ్గరకు రాఘవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషిస్తూ, అనర్గళంగా వాళ్ళిద్దరి డైలాగ్ డెలివరీ పోటీలు పడి మరీ నటించారు.నేను సినిమాల్లో బ్రహ్మానందం గారిని ఈ విధమైన పాత్రల్లో ఎప్పుడూ చూడలేదు.ఎందుకంటే బ్రహ్మానందం గారంటే నవ్వుకు కేరాఫ్ అడ్రస్.అంతేకాకుండా ఆయన టైమింగ్ ఉన్న గ్రేట్ ఆర్టిస్ట్.మిత్రుడితో నాకు బతకాలని లేదురా, నాకు ముక్తిని,ప్రసాదించమని,వేడుకునే సన్నివేశం నాకైతే దుఃఖం ముచ్చుకొచ్చింది.కళ్ళల్లో నుంచి అప్రయత్నంగా నీళ్ళు జారాయి.గుండె పిండిన ఒక అనుభూతి,నన్ను సినిమాలో లీనమయ్యేలా చేసింది.
              ఇక జాతీయ  నటుడు ప్రకాష్ రాజ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఆయన ప్రూవుడ్ ఆర్టిస్ట్.ఎన్నో పాత్రల్లో తన విలక్షణమైన నటనతో, అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలను పొందారు.మామూలుగానే ఇందులో కూడా
సినిమా అంతా తానై నడిపించాడు.సంగీత దర్శకుడు ఇళయరాజా గారి సంగీతం వంక పెట్టేలా ఉంటుందా..ఆయన సంగీతంలో,ప్రపంచంలోనే, ఎన్నో ప్రయోగాలు చేసి, పేరు సంపాదించుకున్న వ్యక్తి.ఇందులో, మధ్య మధ్యలో ఆయన పాడిన పద్యాలు, చాలా మీనింగ్ ఫుల్ గా, సందర్భోచితంగా ఉన్నాయి.సినిమా చివర్లో ప్రకాష్ రాజ్ గారు అనే ఒక మాట శ్మశాన వసంతం...పొయెటిక్ సెన్స్ ని తలపించింది.
                 అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఒకరు ప్రకాష్ రాజ్, మరొకరు బ్రహ్మానందం.మిగితా వాళ్ళు తమ తమ కారెక్టర్లకి న్యాయం చేసారనే చెప్పవచ్చు.ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం గార్ల నటన కోసమైనా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.మీరూ వెళ్ళండి.
                          
కామెంట్‌లు