ఇస్తినమ్మ వాయనం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ సంబంధాలు చిత్ర విచిత్రంగా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం ఉండడం ఒకరినొకరు ప్రేమించుకోవడం  ఆత్మీయతలను పంచుకోవడం సహజంగా చూస్తూ ఉంటాం.  కానీ స్నేహితుడు గాని బంధువులు కానీ లేదా బయట వేరే మిత్రుడు కానీ కలిసినప్పుడు వారితో అంత  ఆత్మీయంగా ఉండలేము.  కారణం  మన పెద్దలు చెప్తూ ఉంటారు  ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు  అంటే నీవు దేనినైతే ఇస్తున్నావో దానిని నేను స్వీకరిస్తున్నాను  అలాగే నేను ఇచ్చిన దానిని కూడా స్వీకరించాలి అన్న అర్థం దాంట్లో ఇమిడి ఉంటుంది. దానితో ఇద్దరూ సన్నిహితులవుతారు  ఒకరు చెప్పింది మరొకరికి వేదంగా ఉంటుంది అంతా కలిసి మెలసి తమ జీవితాలను  కొనసాగిస్తూ ఉంటారు  ఆత్మీయతలు పెరిగిన కొలది బంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిజంగా ఇతరులతో సన్నిహితంగా ఉండాలని వారితో  సొంత కుటుంబంగా వ్యవహరించాలని ఉన్నవ్యక్తులు అలాంటి వ్యక్తులు దొరికినప్పుడు అతి సన్నిహిత స్నేహితులవుతారు  అలాకాకుండా పరిచయాలు ఉన్నా ఎవరికి వాడుగా జీవిస్తూ ఎవరిని గురించి ఎవరూ పట్టించుకోకుండా  ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉన్నప్పుడు  వారి మధ్య ప్రేమలు అనురాగాలు  పెరిగే అవకాశం లేదు. ఎవరికి వారు ఆయనతో మనకు సంబంధం లేదు కదా కొత్తగా ఎందుకు  మనం ముందు కలుపుకుంటే చులకన కదా అని ఎవరికి వారు ఆలోచించి  చివరకు ఇద్దరూ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. దానితో ఎవరి పని వారు ఎడ మొహం  పెడ మొహం ఎదురుగా ఉన్నా ఒకరినొకరు హలో అనుకోవడం కూడా ఉండదు. ఇలాంటివారు మరొక రకం  మనుషులు. కొంతమంది ఆడంబరంగా కనిపించాలని  నలుగురి ముందు తాను ఎక్కువ అని  చెప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డంబాలు పలుకుతూ ఉంటారు  ఇలాంటి వారిలో ఏ ఒక్క విషయము నమ్మడానికి వీలు లేదు అలాంటి వారికి  స్నేహితుడు ఎలా దొరుకుతారు ఎన్నో మాయలు చేస్తూ దానివల్ల వారిని స్నేహితుడిగా  మలుచుకోవాలి అని చూసే వాడి పని ఎప్పుడు ఫలించదు. అవతల వాడు కూడా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారు. ఇతను చేసే మాయలు మర్మాలు డాంబికాలు అన్నీ గమనిస్తూనే ఉంటాడు  కనుకనే అతనికి దూరంగా ఉంటూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తాడు  ఈ జీవిత మార్గాలను తెలుసుకుంటే  ప్రతి వ్యక్తి  ప్రశాంత జీవితాన్ని గడుపుతాడు అని వేమన చెబుతున్నారు  ఆ పద్యాన్ని చదవండి.

"తను వలచిన దావలచును   తనువలవకయున్న దన్నుదావలవదురా  
తనదు పటాటో పంబులు  తన మాయలు పనికిరావు (ధరలో వేమా)..."


కామెంట్‌లు