ఉగాది;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.--వనస్థలిపురం, హైదరాబాదు.--చరవాణి:- 9866757278.
 తే.గీ.
మల్లె పూల మధురిమలు మరులుగొలుప
మావి పూమెక్కి పికరాజు మాపుగూయ
పిల్ల గాలులు చల్లంగ పిలువనంప
చైత్రమేతెంచె జగమున చటులనింప!
తే.గీ.
చకిత గానాల ముంచెత్తు చరితపికము
చిగురులందించి పులకించె చిన్నమావి
పుడమి ధరియించె ప్రేమైక పుష్పవల్లి
మదిని వెలుగొందె మరులొల్కు మదనధనువు!
తే.గీ.
ఋతువులందున రారాజు ఋభువుగాదె
జగమునందున నింపెను జానువెంతొ
చైత్రమందుకె నూతన చౌక్షమాయె
సొగసులీనెను చూడగా చోద్యమాయె!
తే.గీ.
రాజు వాసంతుడు వెడలె రాణమించ
శుభములందించ సమకట్టి శోభతోను
ధరణి వెలిగించె వర్ణాల ధనువుదాల్చి
కరుణ సింధువై మనలను కాచినాడు!!

కామెంట్‌లు