శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం ; - సి.హెచ్.ప్రతాప్

 సాయి భక్తాగ్రేసరుడైన రేగే  ఒక సంధర్భం లో హజ్రత్ తాజుద్దీన్ బాబా వారి దర్శనానికి నాగ్ పుర్ వెళ్ళాడు.ఆ రోజులలో తాజుద్దీన్ బాబా రాజు గారి అంత:పురం లో నివసిస్తుండేవారు.తన అమోఘమైన తపశ్శక్తితో ఎందరికో అలవి కాని వ్యాధులను నయంచేయడం, సుఖ సంపదలను, భోగ భాగ్యాలను ప్రసాదించడం , తన దివ్యత్వాన్ని ప్రస్పుటపరిచే ఎన్నో అమోఘమైన లీలలను తాజుద్దీన్ బాబా ప్రదర్శిస్తుండేవారు.పేదల పాలిటి కల్పవృక్షం గా పేరు గాంచిన శ్రీ బాబా వారి  దర్శనం కోసం  ప్రతీ రోజూ దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్త జనం వస్తుండేవారు. రేగే మహరజా వారి అంత:పురం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా వారి దర్శనం కోసం తోపులాట జరుగుతోంది. చేసేది లేక ఒక పక్కగా కూలబడి సాయి నామ స్మరణ ప్రారంభించాడు రేగే. రైలు సకాలం లో అందుకోవాలంటే మధ్యాహ్నం మూడు గంటల వరకూ మాత్రమే సమయం వుంది. ఆ లోపలే బాబా వారి దర్శన భాగ్యం కల్పించమని రేగే శ్రీ సాయిని ఎంతగానో ప్రార్ధించాడు.
జన సమ్మర్ధం చూస్తే రెండురోజులైనా దర్శనం అయ్యేటట్లు లేదు. కాని సాయి అనుగ్రహ ఫలితంగా రేగేకు రెండున్నరకు రాజప్రాసాదం నుండి పిలుపు వచ్చింది.ఎంతో ఆత్రం గా వెళ్ళిన రేగేకు తాజుద్దీన్ బాబా వారి ప్రత్యేక దర్శనం లభించింది.బాబా వారిని తృప్తిగా దర్శించి, ఆయన అశీర్వాదములను అందుకొని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు రేగే.
మరొక సంధర్భంలో సిద్ధ పురుషుడైన శ్రీ శీలలనాధ్ మహరాజ్ నాగపూర్ కు రాగా రేగే వారిని కూడా దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. సాధారణంగా భక్తుల ఇళ్ళకు వెళ్లని ఆ మహరాజ్ వెంటనే రేగే ఆహ్వానాన్ని మన్నించి అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి తమ ఆశ్శీస్సులు అందజేసారు.

కామెంట్‌లు