ఉట్టి!!! ప్రతాప్ కౌటిళ్యా
ఉండేది ఊర్లో
నివసించేది పూరి గుడిసెలో
చెప్పేది హరికథ
వినేది బుర్రకథ!!!

సముద్రం ఉంటేనే
అలలు ఉంటాయి
మనసుంటేనే
కలలుంటాయి!!!

ఎగిరేసిన గాలిపటానివి నీవు
దారం లేదు ఆధారం లేదు!!

విరిగిన కెరటానివి నీవు
తీరం చేరలేదు!!

ఎండిన గుండెవు నీవు
రక్తపు చినుకు కై
ఎందుకు ఎదురు చూస్తావు!!

ఆకుపచ్చని రక్తపు మరకలతో
తడిసి పోయావు!

పసుపు పచ్చని
సంధ్య పొద్దుల్లో
స్నానమాడావు!!

చీకటి జీడిగింజలతో
దిష్టిబొమ్మ అయ్యావు
నిప్పుల్లో ఉప్పు వయ్యావు!!?

వ్యూహాల్ని నిర్మించిన
సాలీడు సారధ్యంలో
నీటి చినుకులా చిక్కుకున్నావు!!?

సముద్ర తీరాన
శంఖం పూరిస్తే
సుడిగుండాలని సృష్టించిన
సముద్ర యుద్ధానివీ నీవు!!

కేక లన్నింటిని
ఒకటి చేసి నాటి ఆకలిని
తీర్చిన పసిడిపంటవు నీవు!!

పారే నీరు పాదాలపై పడి
లేచిన పంటచేలన్ని
చిలుకల గుంపుల్లా గుసగుసలాడుకుంటూ
పైరగాలి గుంపుల్లో కదులుతున్న
పరిమళానివి నీవు!!

నడుస్తున్న భూమి
కొంగుకు కట్టుకున్న
అర్ధ రూపాయి బిళ్ళలా
అందమైన ఆడపిల్లవు నీవు!!?

తడబడే అడుగులు
బుడిబుడి నడకలు
చిరుత పరుగులకు చిహ్నాలు

నీ వెనుకడుగు
రేపటి లోకానికి
సింహావలోకనం!!!

విరిచి వేసిన రంగుల్ని
కలుపుతూ పోయే
ఉషస్సులన్నీ గడ్డ కట్టిన
మంచు పర్వతాల్లా నీవు
కరుగుతూ పోతుంటావు!

వెనక్కి తిరిగి చూసే
చూపు గుడ్డిదయి
గడ్డిపువ్వు కాలం చేసింది

వెక్కిరించే
కాగితపు పూలన్నీ
నీ చెమట పరిమళాలద్దుకుంటూ
నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాయి!!?

రహస్యాల్నీ పండించిన
వెన్నెలను
అమాయకపు అమ్మ చూపుడు వేలుతో
చంద్రున్నీ
ఉట్టిలో దాచి పెట్టింది!!!?

పాలెం డిగ్రీ కళాశాల వజ్రోత్సవం మరియు తెలుగు భాషా చైతన్య సమితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం కోసం రాసిన కవిత.
26/03/2023
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు