సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -70
చంపక పట న్యాయము
******
చంపకము అంటే సంపెంగ పువ్వు.
పటము అంటే బట్ట,పుట్టము, వస్త్రము, చిత్తరువు వ్రాయు వస్త్రాధికము, ప్రత్తి,సార చెట్టు, పాము పడగ లాంటి అర్థాలున్నాయి.
చంపక పట న్యాయము అంటే బట్టలో లేదా వస్త్రంలో సంపెంగ పువ్వును కొంత కాలం పాటు ఉంచి తర్వాత తీసి వేసినను సంపెంగ పువ్వు యొక్క పరిమళం ఆ వస్త్రాన్ని విడువదు.అలాగే సజ్జన సాంగత్యం వలన  అలవడిన సుగుణ సంపద  మానవుడు ఎప్పుడూ విడువకుండా ఉంటాడనే అర్థంలో ఈ చంపక పట న్యాయమును ఉదాహరణగా చెబుతారు.
అందుకే మంచి వారితో  స్నేహం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో  భర్తృహరి సుభాషిత పద్యాన్ని చూద్దాం.
'సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు/ గౌరవమొసంగు జనులకు కలుషమడచు/ కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు/ సాధు సంగంబు సకలార్థ సాధనంబు'
మంచివారితో స్నేహం బుద్ధి మాంద్యాన్ని పోగొడుతుంది. సత్యమైన మాటలనే  పలుకునట్లు చేస్తుంది. మనసును నిర్మలంగా ఉంచుతుంది. కీర్తిని నలుదిశలా వ్యాపింప జేస్తుంది.... ఇలా సజ్జనులతో స్నేహం వల్ల సకల ప్రయోజనాలను పొందవచ్చని భావం.
మంచివాడుగా పేరు ప్రఖ్యాతులు పొందినా, చెడ్డ వాడుగా  అందరితో అసహ్యింపబడినా కారణం చాలా వరకు ఆ వ్యక్తి చేసే స్నేహాన్ని బట్టి ఉంటుందనేది అక్షర సత్యం. 
భాగవతం లోని చతుర్థ స్కంధములోని ఈ పద్యం కూడా అదే చెబుతుంది...'ధరణి సజ్జన సంగంబు దలప సుభయ/సమ్మతంబగు వారలు సలుపు నట్టి/ సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల/జనములకు సుఖకరమగు జనవరేణ్య' 
అర్థం ఏమిటంటే ఇరువైపులా ఉపయోగపడేలా మంచివారి మధ్య జరిగే సంభాషణ, వారు చేసే చర్చలు, వాటిల్లో తలెత్తే ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు... ఇవన్నీ అందరికీ మేలు చేస్తాయని భావం.
ఇలా సజ్జనులతో తిరుగుతూ, అనేక మంచి విషయాలు వినడం వల్ల అలవడిన మంచి గుణాలు ఎప్పుడూ తోడుగా ఉండి మంచి పేరు తెస్తాయనేది  చంపక పట న్యాయం చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు