సుప్రభాత కవిత ; -బృంద
అలల  కదలికలో 
ప్రత్యేకమైన లయల
అందమైన జలతరంగ ధ్వని

జలపాతపు వేగంలో 
జలజలా  జారిపోతున్న 
సితార గానాలు

ఆకుల గలగల చప్పుడులో
కోటివీణలు ఒకేసారి
మోగినట్టు చక్కని వీణానాదం

గువ్వల కువకువలో 
చిన్ని వటువులు వల్లె వేస్తున్న
వేదపాఠాలు

గాలి ఈలల సవ్వడిలో
శృతీ శుధ్ధంగా వినవస్తున్న
రమణీయ  మురళీగాన రవళులు

పువ్వులపై తేలుతూ
మకరందం గ్రోలుతూ
ఝుమ్మని పాడుతున్న తుమ్మెదలు

గాలికి కొబ్బరి మట్టల
రాసుకుంటే  వినిపించు
మృదంగ విన్యాసాలు

కదిలీ కదలక కదిలే
పచ్చని పైరు చేసే
సన్నని వాయులీన ధ్వనులు

అమ్మ ముస్తాబు చేసిన పిల్లల్లా
పచ్చని దుస్తుల్లో చెట్టూ చేమా
చేస్తున్న ఉత్సాహపు సందళ్ళు

జగతి సమస్తమూ  సుందరంగా
అపురూపమైన పెళ్ళిపందిరిలా
అలంకరించుకోగా....

వెలుగురథమెక్కి వినువీధుల
ఆగమిస్తున్న  ఆప్త మిత్రుని
ఆహ్వానిస్తూ 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు