రంగులకేళి;- డా.రామక కృష్ణమూర్తి
 అనేక రంగులు వెలిసిపోయాక మిగిలేది తెల్ల రంగే.
పుట్టుకతో ఎరుపు భయపెడితే,
పెరిగే దశలో పచ్చ రంగు మోదానికి కారణమైంది.
తెలుసుకునే వయసులో పసుపు స్పష్టీకరించింది.
మసలుకునే వయసులో నారింజ నిగ్గు తేలిస్తే,
యుక్తవయసులో నీలం రంగు ముందుకు నడిపించింది.
బంధాలతో,బాధ్యతలతో,
కర్తవ్యాలు నిర్వహించే వయసులోనే గులాబీ రంగు
పరిమళాలు వెదజల్లింది.
గోధుమ వర్ణం పరిణతిని చెందించే వయసులో తారసిల్లితే,
ఊదా రంగు వాస్తవాలు మెలిపెట్టి చెప్పింది మధ్యవయసులో.
పరిణతి చెంది అన్నీ తెలిసిన వయసులో తెలుపు వెక్కిరించింది.
జీవితం రంగులరాట్నమై తిప్పుతూనే ఉంటుంది.
రంగులకలలు వస్తూనే ఉంటాయి.
అన్ని రంగులు దూరమయ్యాక
అగ్నిహోత్రుడు కాల్చేసాక,
మిగిలిన బూడిదలో వెతుకులాటతో పరిసమాప్తి.

కామెంట్‌లు