సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -69
చిత్రితాంగ జంబుక న్యాయము
******
చిత్రకాయం అంటే చిరుత పులి. జంబుకము అంటే నక్క.
చిత్రితాంగ జంబుకము అంటే చిరుత పులిని చూసి తనలా ఉండాలని నక్క వాత పెట్టుకున్నట్లు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
వ్యవహారికంలో మన పెద్దలు బాగా ఉపయోగించే సామెత ఇదే  'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు'.
కొందరు వ్యక్తులు సహృదయత, సత్ప్రవర్తన,పరోపకారం లాంటి మంచి గుణాలు కలిగి సమాజంలో  పేరు ప్రఖ్యాతులు పొందుతుంటారు.అలాంటి వ్యక్తులను చూసిన కొందరికి ఈర్ష్య అసూయ కలుగుతూ ఉంటాయి.
 వాళ్ళకు  సమాజం ఇచ్చే గౌరవ మర్యాదలు, వాళ్ళ దర్జా ,హోదా తమకు లేదే, వాళ్ళలా  తాము లేమే అనుకుంటూ చాలా బాధ పడుతూ ఉంటారు.
అలా బాధతో సరిపెట్టుకుంటే ఫరవా లేదు .కానీ వాళ్ళలా ఉండటం కోసం  వెంపర్లాడుతూ, వారిని అనుకరించేందుకు ప్రయత్నం చేస్తుంటారు.అది కూడా మంచి కోసం కాదు.
అలా చేయడంలోంచి వచ్చిందే చిత్రితాంగ జంబుక న్యాయము.
దీనికి సంబంధించిన ఓ కథ మనందరికీ తెలిసిందే.అనగనగా ఓ అడవి.అందులో  అనేక జంతువులతో పాటు నక్క ,చిరుత పులి కూడా ఉన్నాయి.
చిరుత పులి అంటే ఏ జంతువుకైనా భయమే కదా! దాన్ని చూడగానే జంతువులన్నీ భయపడి తలోదిక్కు పారిపోయేవి.ఇది చూసిన నక్క బాగా ఆలోచించింది. అలా పులిని చూసి పారిపోవడానికి కారణం దాని ఒంటిమీద ఉన్న  చారలేననీ మనసులో అనుకుంది.
అలా తాను కూడా 'ఒంటిమీద చారలు వేయించుకుంటే పులిలా దర్జాగా తిరొగొచ్చు.తనను చూసి జంతువులు పారిపోతుంటే ఆనందంగా చూడొచ్చు" అనుకుంది.
అనుకున్నదే తడవుగా   ఇనుప వస్తువులు తయారు చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళింది.  ఒంటికి వాతలు పెట్టమంది. అతడు సరేనన్నాడు.ఇనుప కడ్డీ బాగా కాల్చి  ఒంటిపై వాతలు పెడుతుంటే ఆ వేడికీ, మంటకు, నొప్పికీ తాళలేక లబోదిబో మంది. 
'వాతలు వద్దు మరేదైనా ఉపాయం చూడమని వేడుకుంది'.రంగులతో అలాంటి చారలను  వేసుకోమని చెబుతాడు.
అలా రంగులతో పులి చారలు వేయించుకుని  అడవిలో తిరుగుతూ ఉంటుంది. 'ఇదేదో కొత్త జంతువు విచిత్రంగా ఉందే' అనుకుంటూ జంతువులు ఆశ్చర్యం, భయంతో దూరంగా ఉంటాయి.
తన కోరిక నెరవేరినందుకు మురిసిపోతుంది. ఆ సంతోషంలో పులిలా గాండ్రించ బోతుంది కానీ దాని సహజమైన ఊళే  గొంతులోంచి వస్తుంది. అది విన్న జంతువులు అది నక్కని తెలుసుకుని 'అలా మోసం చేస్తావా? అంటూ దేహశుద్ధి చేస్తాయి.
దీని వల్ల మనకు తెలిసిందేమిటంటే  ఎవరి ప్రత్యేకత వారిదే అంతే కానీ ఇతరులను చూసి వాళ్ళలా ఉండాలనుకుంటే ఇలాంటి తిప్పలే వస్తాయి.
కాకపోతే ఇతరులలోని మంచి గుణాలను మాత్రమే గ్రహించి అలా ఉండాలని చేసే ప్రయత్నం మంచిది కదా!
ఇతరుల్లానే ఉండాలనుకోవడం అనుకరణ. అలా 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు' కాకుండా ఇతరులు నడిచే మంచిదైన దారిలో నడవాలనుకోవడం అనుసరణ. ఈ తేడా తెలుసుకుని మంచి మార్గంలో నడుద్దాం. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం