హిమపాతం లాటి వెన్నెల వానలో
హాయిగా తడిసి భారమైన మల్లెలు
పరిమళాన్ని పంచి ఇచ్చి తృప్తిగా
తీగల డోలికలు ఊగుతున్న వేళ
వెలుగుల జడికి బెదిరిపోయి
చాటుకోసం వెదుకుతూ పారిపోయి
రేయంతా వేదించిన చీకటి విధిలేక
వెలుగులోనే కలిసిపోయినవేళ
మత్తుగా నిదురించిన జగతిని
పూల పరిమళాల బహుమతినిస్తూ
దూరపు సవ్వడులన్నీ మోసుకొచ్చి
మంగళకరంగా సన్నాయి మోగించేవేళ
మంచి కోసం మార్పు కోసం
ఎదురుచూసే హృదయాలకు
మధురమైన స్నేహపరిమళాలు
ఆందోళనలు మరిపించే వేళ
ఆగమించు వేకువ కోసం
కనుల నీరు నింపి వేచి చూసే
మధురక్షణాల అనుభూతిని
అనుభవించి ఆనందాలు పంచేవేళ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి