గగనపు వేదికపై
వెలుగులతెర తీయగా
తొలిసంధ్యలో వెలిగించిన
అరుణదీపమాలికలా
పరచుకున్న సింధూరపు రంగులు.
తూరుపు కొండల నడుమ
విరిసిన శతదళ సువర్ణ కమలం
బంగరు కాంతులు చిమ్ముతూ
నింగికి నేలకు వంతెన వేసింది
కుసుమ పరాగపు పొత్తిళ్ళలో
పవళించిన పరిమళం
మెల మెల్లగా ప్రసరించి
పరిసరాలలో సుగంధాలు నింపింది
రాతిరి నింగిని మెరిసిన
చుక్కలన్నీ ....వేకువ వెలుగున
ముచ్చటగా దిగివచ్చి
విరిసిన పువ్వులతో స్నేహం చేసాయి.
మెరిసే పువ్వుల నవ్వులలో
నిదురలో నవ్విన పసికందు
అందం కనిపించి ...మనసు
పరవశించి పొంగిపోయింది
ఊహల మాలల నెత్తావి
మాధురులు ఊయలూపి
మనసును మబ్బులపై ఊరేగించి
పలకరించింది పరవశింపచేసింది
హృదయాంతరాళాన వీచిన
ఆనంద వీచికల చందన శీతల
సమీరాలను ఆస్వాదిస్తూ
ఆహ్వానిద్దాం అందమైన వేకువను
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి