సుప్రభాత కవిత ; -బృంద
కోనంతా వెన్నెల్లో తడిసి
మత్తుగా నిదరోతుంటే
మెత్తగా తలనిమిరి
మేలుకొలుపుతున్న కిరణాలు

నునువెచ్చని స్పర్శకు
హాయిని అనుభవిస్తూ
బయటకు రాలేని
మగతలో  ప్రకృతి

పురులు విప్పిన వెలుగులు
పుడమి పై పుత్తడి రంగులు
పులిమింది
వేసవిలో చలి వేసిన భావనతో
భువనం పులకరించింది

పసిపాప మొహంలో
బోసి నవ్వులా  
నేలంతా పరచుకున్న
తొలికిరణాలు

నింగిలో భూపాలం
నేలపై  వసంతం
గాలిలో మోహనం
నీటిలో కల్యాణీ...
అనురాగాలే అన్నీ

అన్నీ చూస్తున్న మనసులో
ఆనందభైరవి....పల్లవించే
అందమైన అద్భుతమైన
హృదయంగమ ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు