సుప్రభాత కవిత ; - బృంద
కలతలెన్నో కమ్ముకున్నా
కాలం కదలక మానదు
తిమిరాలెంత ఆవరించినా
తెల్లవారక తప్పదు

వర్షం ఎంతగా కురిసినా
ఆగిపోక తప్పదు
శిశిరం ఎంతగా శోధించినా
చివురులు రాక తప్పదు

సుఖమైనా దుఃఖమైనా
కలకాలం మనతో ఉండదు
ఏది వచ్చినా అదే మనదని
అడుగు ముందుకే వేయక తప్పదు

కన్నీటిలో కలల నావలు
మునిగినా సాగక తప్పదు
ముళ్ళు కాళ్ళను కోసుకున్నా
కొత్తదారులు వేయక తప్పదు

చిమ్మచీకటి దారిలోనా
అడుగు వేయక తప్పదు.
గెలుపు ఎండమావైనా
అలుపురాని యుధ్ధం తప్పదు

లోకమంతా ఎదురు నిలిచినా
ఆరాటం ఆయుధంగా
ఆశే ఊపిరిగా నిన్ను నీవు
మార్చుకునే పోరాటం తప్పదు

రేయి మనసును తొలిచిన
విషయాలన్నీ వేకువ కాగానే
వడివడి నడకల తొందరలో
వెలుగుల వెల్ల వేసుకోక తప్పదు

ఎన్నో ప్రశ్నలకు జవాబుగా వచ్చే
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు