సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం.
 రంగు రంగుల హోలీ రంగుల సింగిడి రంగేళీ ఆనందాల కేళి... హోళీ పండుగ శుభాకాంక్షలతో 💐
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
న్యాయాలు -66
చందన గుణ న్యాయము
*****
చందనము అంటే  మంచి గంధపు చెట్టు. దీనినే శ్రీఖండము,మలయజము అంటారు. చందన గుణం అంటే చందన వృక్షం యొక్క పరిమళ భరితమైన లక్షణం అన్నమాట.
ఈ చందన వృక్షం ఏం చేస్తుంది. తానున్న పరిసరాలను తన పరిమళాలతో గుబాళింప జేస్తుంది. తన సమీపమున ఉన్న ఇతర జాతి వృక్షాలకు, చుట్టూ ఉన్న చెట్లకు సైతం తన సుగంధాన్ని లభింప జేస్తుంది.
అందుకే చందన వృక్షాన్ని మానవీయ విలువలు కలిగిన కూడిన వ్యక్తిత్వం, హృదయంతో పోల్చుతారు.
 మానవీయ హృదయం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు.తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన సుగుణాలతో మార్చేస్తాడు. సమాజ రుగ్మతలను తొలగిస్తాడు.
పూలను కట్టిన దారానికి పూలు తమ సువాసన ఇచ్చినట్లుగా చందన గుణం కలిగిన వ్యక్తి కూడా  అలాగే ప్రవర్తిస్తాడు.అతని వల్ల కుటుంబం,కులం,మతం, జాతి ఏదైనా శోభాయమానంగా మారుతుంది.మంచి పేరు వస్తుంది.
అందుకే " కులములోన నొకడు గుణవంతుడుండిన/ కులము వెలయు వాని గుణము చేత/ వెలయు వనములోన మలయజంబున్నట్లు/ విశ్వధాభిరామ వినురవేమ " అంటారు వేమన తన పద్యంలో.
 వంశంలో  మంచి గుణాలు కలిగిన వ్యక్తి  ఒక్కడు జన్మించినా అతని వల్ల కులం, వంశమే కాకుండా జాతికీ,సమాజం మొత్తానికీ మంచి పేరు వస్తుంది అంటారు. 
మరి మంచి అంటే ఏమిటి...సత్ప్రవర్తన, సహృదయత,నీతి నియమాలు పాటిస్తూ ఎవరికీ హాని చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం తపించడం, ఉన్నతమైన సమ సమాజ స్థాపన కోసం కృషి చేయడమని చెప్పవచ్చు.అలాంటి వ్యక్తుల వల్ల తరతరాల వంశ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.
"ఎంత పెద్ద అడవి అయినా అందులో ఒక్క చందనపు చెట్టు ఉన్నా అడవి మొత్తాన్ని సువాసనతో నింపుతుంది కదా!" అనే అర్థంతో వేమన రాసిన పద్యం అక్షర సత్యం కదా!
అలాంటి కోవకు చెందిన  జ్యోతిభా ఫూలే అంబేద్కర్, సావిత్రి భాయి ఫూలే, గాంధీజీ,తిలక్ లాంటి ఎందరో మహానుభావులు  సమాజ శ్రేయస్సుకు పాటు పడిన చందన వృక్షాలు.
 మనిషన్నాక  మానవీయ విలువలతో  జీవిస్తేనే మలయజంలా సమాజంలో ప్రకాశిస్తాడని చందన గుణ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
 ప్రతి ఒక్కరం చందన వృక్షాలమై సమాజాన్ని పరిమళ భరితంగా మారుద్దాం.మన ముందున్న తరాలను చందన గుణ న్యాయమునకు అనుగుణంగా తీర్చి దిద్దుదాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు