తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అన్నీ ఉన్న విస్తరి:-గాలికి ఎగురదనుట, నిండుగా అణిగిమణిగి ఉండు ననుట.
విస్తరి అంటే తెలియనిది కాదు తేలికైనది. చిన్నగా గాడ్పు వచ్చినంతనే ఎగిరిపోతుంది. చులకనైనది. అయితే విస్తరిలో అన్ని రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎగురదు. అన్నీ ఉన్నా విస్తరి ఎగురదు. మిడి మిడి జ్ఞానము గలవాడు మిడిసి మిడిసి పడతాడు. అన్నీ తెలిసిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. అమాయకులను మోసగిస్తూ ఉంటాడు. అల్పుడు ఖాళీ విస్తరిలాంటి వాడని అర్థం. మనమంటాము కదా! నిండుకుండ తొణకదు. విలువ గలవాడు ఎగిరి పడడు. విలువ లేని వాడి మోతనే ఎక్కువ. విలువ గలవాడు మితభాషి. విలువ లేనివాడు అమిత భాషి. అందుకే వేమన ఒకచోట అంటారు.
"కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా"అని-అల్పజ్ఞుడికి, అనల్పథ్యునికి భేదం ఉంది కదా.! చాలినంత ప్రజ్ఞ. విజ్ఞానమున్నవాడు అన్ని ఉన్నా విస్తరి లాంటివాడు.
ఈ జాతీయం ఎక్కువగా వాడు కలవలేదు. ఎందుకంటే విస్తరి ఉపయోగం చాలా మట్టుకు పోయింది. ఆ కాలంలో విస్తరిని, మోదుగాకులతో గాని, తునికి ఆకులతో గానీ, అరటి ఆకులతో గాని, లేదా బాదాం ఆకులతో గాని చేసేవారు. కొందరు తామర ఆకులతో విస్తర్లు తయారు చేసేవారు. ఈ నవీన యుగంలో పేపర్ ప్లేట్లు వచ్చాయి. అవి కూడా విస్తర్ల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి ఈ జాతీయం రాబోయే కాలంలో రాబోయే తరానికి అర్థం కాదనుకుంటున్నాము.

కామెంట్‌లు