పచ్చగ విరిసిన పువ్వులు
మదిలోదాచిన మకరందాలను
ప్రభువుకు నివేదించాలని
పరమభక్తితో ఎదురుచూపులు
ఇపుడే వచ్చిన ఆమనికి
గగనం మెరిసిపోయే
వేకువ చూడాలని
ఉరకలేసే ఉత్సాహాం
వసంతాన్ని సొంతం చేసుకున్న
పుడమికి తన పుత్తడి సొగసులు
తొలివెలుగులో దినకరుడు
చూసి మురిసిపోవాలని వేడుక
పసిడి పంటలను ప్రసవించే
పచ్చని పంటసిరికి.. కారణమైన
ప్రభాకరుని పదములకు
ప్రణమిల్లాలని పరవశం
చిక్కని కొమ్మల అల్లుకున్న
చక్కనితీగలూ..పొదలున్న
జంతుజాలానికి నెలవైన
హరితవనానికి రవిని చూచు కోరిక
జోరుగ పారే జలపాతాలలో
నేరుగా దూకి కనులవిందుగ
జలకమాడే కిరణాల జిలుగులు
తిలకించాలని గిరి శిఖరాల నిరీక్షణ
కనుచూపు మేరలో కిరణాల రాక
కనులారచూసి కరిగి నీరైపోయి
కమలబాంధవుని పాదములు
కడగాలని మంచుకొండల ఎదురుచూపు
మహాదీపానికి మంగళహారతికై
ఎరుపు వర్ణపు మబ్బుల
ఎదురుకోలు సన్నాహములతో
అంబరపు సంబరాలు
క్రమము తప్పక ఆగమించి
లోకముల కంటికి రెప్పగా కాచు
జగత్కల్యాణమూర్తికి
ఆత్మనివేదనగా అంతరంగము పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి