సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -76
తండుల భక్షణ న్యాయము
*****
తండులం అంటే బియ్యం. భక్షణం అంటే తినడం.తండుల భక్షణం అంటే బియ్యం తినడం.
బియ్యాన్ని వండుకొని తినాలి కానీ వండకుండా తినడం అంటే ఒళ్ళు బద్దకం చేత వండకుండా తినడం అనే అర్థంతో "వండుకో లేక బియ్యం బొక్కినట్లు" అనే సామెత తో పోల్చుతూ చెప్పిన న్యాయమే "తండుల భక్షణ న్యాయము ".
అసలే బద్ధకస్తురాలు.పైగా ఆకలి వేస్తుంది. ఏం చేయాలో తోచక బియ్యం తెచ్చుకుని బుక్కిందట.
దీనికి సామ్యంగా మరో సామెత కూడా పెద్ద వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. "ఒళ్ళు ఒంగనోడు దొంగల్లో కలిశాడు అన్నట్లు"
అలా వండుకోకుండా  బద్దకంతో బియ్యమే తింటే ఏమౌతుంది? కడుపు నొప్పి రావడం,ఆ తర్వాత అందరితో చీవాట్లు పడటం ఖాయం. 
బద్ధకం మనసుకైనా శరీరానికైనా అనర్థహేతువే.కాళ్ళూ చేతులూ అన్నీ సక్రమంగా ఉన్న వ్యక్తి చిన్నదో పెద్దదో పని చేసుకుని బతకాలి. అంతే కానీ  శ్రమ లేకుండా బాగా సంపాదించాలని దొంగలతో కలిస్తే పట్టుపడకా తప్పదు. దేహశుద్ధితో పాటు పరువూ మర్యాద గంగలో కలవకా మానదు.
ఇలాంటి బద్ధకస్తులను హెచ్చరిస్తూ రాసిన పద్యాలను చూద్దాం.
పెద్దలు విచ్చేసినచొ/ బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్/ హద్దెరిగి లేవకున్నన్/ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!
పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి.కానీ పొగరుతోనో,చిన్నా పెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరికి బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూర్చుండి పోయే వారిని బుద్ధి లేని మొద్దుగా,మూర్ఖునిగా జమ కడతారు.
అలాగే కుమారీ శతక పద్యాన్ని కూడా చూద్దాం... "బద్ధకము సంజె నిద్దుర/ వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్/ గద్దింతురింటివారలు/ మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!"
బద్ధకముతో సాయంకాలం నిద్ర పోకూడదు.అలా నిద్రిస్తే మొద్దువని తోటి వారు నిందిస్తారు.ఇంటివారు తూలనాడుతారన్న మాట".
తండుల భక్షణం న్యాయము అంటే ఈ పాటికి అర్థం అయ్యింది కదా! కాబట్టి అలాంటివి మానాలంటే ఒంట్లోనూ, మనసులోనూ ఉన్న బద్దకాన్ని వీడాలి. 
పిల్లలైనా పెద్దలైనా బద్ధకం వల్ల వచ్చే అనర్థాలను, చెడును తెలుసుకుని చైతన్య స్రవంతులై సాగాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు