ఉగాది(గజల్);- సి.హేమలత(లతాశ్రీ)పుంగనూరు
కోనలలో కూజితాల 
రాగమంతా ఉగాదిదే/
చైత్రమాస మావిపిందె
 వగరంతా ఉగాదిదే/

2.వసంతాన వేపపూత
పరిమళాలు పరుచుకుంది/
చిగురాకుల రంగులతో
సొబగంతాఉగాదిదే//

3.మామిడాకు తోరణాలు
గుమ్మానికి సొబగాయెను/
తెలుగింటీ ఆడపడుచు
సొగసంతా ఉగాదిదే

4.సరిగమలను పలుకుతున్న
కోకిలమ్మ హాయిచూడు/
ఊగుతున్న పూలరెమ్మ 
కులుకంతా ఉగాదిదే//

5.తరతరాల సాంప్రదాయ 
వైభవమ్ము చూడరమ్మ/
సింగారపు పల్లెసీమ
తళుకంతా ఉగాదిదే//

6.పంచాంగపు శ్రవణము తో
చిన్నపెద్ద కేరింతలు/
రాశిగమన జాతకాల
నడకంతా ఉగాదిదే//

7.షడ్రుచులతొ తెలుగు వారి
తొలి పండుగ శొబగుచూడు/
బంధాలను పదిలపరచు
ఘనతంతా ఉగాదిదే//



కామెంట్‌లు